
- పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని అన్ని గురుకుల పాఠశాలల పనివేళలను గత విద్యాసంవత్సరం మాదిరిగా ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా టైం టేబుల్ మార్చడానికి సీఎం అంగీకరించారని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆ సంఘం నేతలు ఆయనను కలిశారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. టైం టేబుల్ మార్పు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు నగదు రహిత హెల్త్ కార్డులు అందించాలని, వీటిని మోడల్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని కోరారు. మోడల్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనం అందించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలని కోరగా.. బడ్జెట్ పై సమీక్షించి వచ్చే ఆర్థిక సంవత్సరం అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. కరీనంగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి కె. నరేందర్ రెడ్డికి సంఘం మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర సంఘ బాధ్యులు వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్ పాల్గొన్నారు.