- దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి: సీఎం రేవంత్
- స్పోర్ట్ వర్సిటీ బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలి
- రెండేండ్లలో రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన
హైదరాబాద్ వెలుగు: తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘మనం రూపొందించబోయే స్పోర్ట్స్‌పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి. అందుకు క్రీడాకారులు, క్రీడారంగ నిపుణులతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాలి” అని సూచించారు. శుక్రవారం తన నివాసంలో రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఇప్పటికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (వైఐపీఈఎస్యూ), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ (వైఐఎస్ఏ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (ఎస్ఏటీజీ) కు సంబంధించి పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అందులో చేయాల్సిన మార్పులు, చేర్పులను రేవంత్ సూచించారు.
సౌత్ కొరియా, క్వీన్స్‌ల్యాండ్ వర్సిటీలపై స్టడీ చేయండి
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడి కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. రెండు రోజుల క్రితం దక్షిణ కొరియా క్రీడా వర్సిటీ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి చర్చించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. దక్షిణ కొరియా క్రీడా వర్సిటీతోపాటు క్రీడా రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ వర్సిటీ అనుసరిస్తున్న విధానాలపై స్టడీ చేయాలని అన్నారు. మరో పది రోజుల్లోనే స్పోర్ట్స్ పాలసీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్ ను వెంటనే రూపొందించాలని సూచించారు. వచ్చే రెండేండ్లలో నేషనల్ గేమ్స్ కు రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ను సంప్రదించాలని అన్నారు. సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ( క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.