రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా జరుగుతోంది. బడ్జెట్లో తెలంగాణకు వివక్షపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అనువజ్ఞులుగా చెప్పుకునే కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్. సభకు వస్తే మోదీ చూస్తారేమోనని కేసీఆర్ భయపడ్డారని రేవంత్ అన్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ కలుగజేసుకుని ఆయనకు సమాధానం ఇవ్వడానికి తాము చాలన్నారు. సంప్రదాయాల ప్రకారం సభ నడపాలన్నారు. ప్రభుత్వం దేనిపై చర్చ చేయాలనుకుంటుందో ముందే తమకు చెప్పాలన్నారు కేటీఆర్.
ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన రేవంత్ రెడ్డి... మీలా మేనేజ్ మెంట్ కోటాలో రాలేదు.. అయ్యా తాతల పేర్లు చెప్పుకుని ఇక్కడకు రాలేదు..స్వయం కృషితో వచ్చా. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకుని వచ్చారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యంగా ప్రవర్తించలేదు అంటూ రేవంత్ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ అనసరంగా చర్చను పక్కకు పట్టిస్తోందని మండిపడ్డారు రేవంత్. కేసీఆర్ ఫ్యామిలీ చర్చను పక్కదారి పట్టించడంలో దిట్ట అని అన్నారు. సీరియస్ ఇష్యూను కేటీఆర్ పక్కకు పట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణకు జరిగినఅన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించరనిఅన్నారు. సభనుంచి భయటకు వెళ్లాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఉందన్నారు . మీ అభిప్రాయాలను చెప్పడానికే చర్చ పెట్టామని చెప్పారు రేవంత్.
తండ్రి తాతల గురించి రేవంత్ మాట్లాడుతున్నారు..రాజీవ్, రాహుల్ గాంధీల గురించి మాట్లాడుతారా? అని ప్రశ్నించారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో వచ్చారని తాము అంటామన్నారు. తెలంగాణపై కేంద్ర వివక్షకు ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు . కేంద్రం తెలంగాణపై హక్కులను కాలరాస్తోందన్నారు. తాము పదేళ్లు కేంద్రంతో కొట్లాడామని.. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవి రావాలన్నారు. ఏపీకి నిధులిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదన్నారు. తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపారని అన్నారు కేటీఆర్.