సోది చెప్పుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా: కేసీఆర్‎కు సీఎం రేవంత్ ఛాలెంజ్

సోది చెప్పుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా: కేసీఆర్‎కు సీఎం రేవంత్ ఛాలెంజ్

హైదరాబాద్: కాంగ్రెస్‎పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్‎లో ఉండి వచ్చిన వాళ్లందరికి సోది చెప్పుడు కాదని.. దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చ పెడదామని సవాల్ విసిరారు. కేసీఆర్ కోసం రాష్ట్రంలో ఎవరూ ఎదురు చూడటం లేదని.. ఆయన రద్దు అయిన వెయ్యి రూపాయల నోటుతో సమానమని సెటైర్ వేశారు. 14 నెలలు ఫామ్ హౌస్‎లో పండుకుని గంభీరంగా చూస్తున్నా అంటున్నాడు.. ఏం చూస్తున్నావ్.. అచ్చోచ్చినా అంబోతుల్లా కేటీఆర్, హరీష్ రావును ఊరిమీదకు వదిలావని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు తిరస్కరించిన ఇంకా బుద్ధి మారలేదని ఫైర్ అయ్యారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధనిక రాష్ట్రమంటూ అబద్ధాలు చెబుతూ.. తెలంగాణను అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారని ధ్వజమెత్తారు. మిగులు నిధులతో ఇచ్చిన రాష్ట్రాన్ని పదేళ్లలో ధ్వంసం చేశారని నిప్పులు చెరిగారు. 

ALSO READ | తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు.. నేను చెప్తె వినలే: కేసీఆర్

కేవలం 60 రోజుల్లోనే రూ.2 లక్షల  రుణమాఫీ పూర్తి చేశామని.. రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుతామని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‎కు నిజంగా చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా అప్పగించినా భయపడలేదని.. ఇచ్చిన మాట మేరకు పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. పాలమూరు ప్రాజెక్టు ఎండబెట్టిన దుర్మార్గుడివి అంటూ పరుష పదజాలంతో కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి, సీఎంగా పని చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో లైక్లు, కామెంట్స్ వస్తే మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు.