మౌనంగా ఉండొద్దు.. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి: సీఎం రేవంత్

 మౌనంగా ఉండొద్దు.. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి: సీఎం రేవంత్
  • సీఎల్పీ మీటింగ్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం 
  • గవర్నర్ స్పీచ్​కు బీఆర్ఎస్​ సభ్యులు అడ్డుతగులుతుంటే విప్​లు ఏం చేస్తున్నరు?
  • మీరు మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తయి  
  • సభ్యులు రోజూ సభకు రావాలి.. పట్టు ఉన్న అంశంపై మాట్లాడాలని సూచన

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్​లో ప్రతిపక్ష సభ్యులు చేసే విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే సభ్యులు, విప్​లు మౌనంగా ఉండటం ఏమిటని సీఎం అసహనం వ్యక్తంచేశారు. ‘అప్పులు, తప్పులు చేసినవాళ్లు సభలో న్యూసెన్స్ చేస్తుంటే దీటుగా ప్రతిఘటించాలె కదా? ఈ విషయంలో విప్​లు పూర్తిగా విఫలమయ్యారు’ అంటూ ఆయన ఫైర్​ అయ్యారు. గురువారం నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని, ఇవి రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తారని, అందుకు అనుగుణంగా సభ్యులు నడుచుకోవాలని చెప్పారు. బుధవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీలోని కమిటీ హాల్​లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. 

దీనికి అధ్యక్షత వహించిన సీఎం.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల ముందు పెట్టేందుకు ఈ సమావేశాలు మంచి వేదికగా నిలుస్తాయన్నారు. కొత్త సభ్యులు ప్రతి రోజు సభకు రావాలని, ఏ సభ్యునికి ఏ సబ్జెక్టుపై పట్టు ఉందో, ఆ అంశంపై మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. సభలో సభ్యులను విప్ లు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ కలిసికట్టుగా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండాలని, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఇలాంటి మంచి పథకాలను పేద, మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా  కృషి చేయాలన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతానని, వారి సెగ్మెంట్లలోని సమస్యలన్నింటిపై చర్చిస్తానని తెలిపారు.  

విప్​ల తీరుపై అసహనం 

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. కమీషన్ల ప్రభుత్వం.. గోబెల్స్ ప్రచారం.. బోగస్ సర్వే.. అంటూ రన్నింగ్ కామెంట్రీ చేశారు. సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఏమాత్రం ప్రతిఘటించకుండా, తమకు సంబంధం లేనట్లుగా మౌనం వహించడంపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘విప్​లు సభలో తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించారు. సభ్యులను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ వాళ్లే కాంగ్రెస్ ​అప్పులపాలు చేస్తోందని అబద్ధాలు మాట్లాడుతుంటే, న్యూసెన్స్ చేస్తుంటే వాళ్ల తప్పులను ఎత్తిచూపాలె కదా? ఎందుకు ఆ పని చేయలేదు’ అని నిలదీశారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ వాయిదా పడిన వెంటనే విప్​లను అసెంబ్లీలోని తన చాంబర్​కు పిలిపించుకొని సీఎం సీరియస్​ అయ్యారు. ఇలా విఫలమైతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని స్పష్టం చేశారు.

సాగర్ ఎమ్మెల్యే జయవీర్​పై ఆగ్రహం

అసెంబ్లీ కమిటీ హాల్​లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతున్న సమయంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ లేచి వెళ్లిపోతుండడాన్ని చూసి సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను ఇంత సీరియస్​గా మాట్లాడుతుంటే జయవీర్ అలా వెళ్తున్నారు. ఇంత నాన్ సీరియస్​గా ఉంటారా? బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్​తో ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ వాళ్లు ఆయనపై అభ్యర్థిని పెట్టరని అనుకుంటున్నారా? వాళ్ల గురించి మీకు చాలా తక్కువ తెలుసు. రాజకీయాలంటే పిల్ల లాట లు అనుకుంటున్నారా?’’ అని మండిపడ్డారు. సీరియస్​గా పని చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలవరని, ఇలాగే ప్రవర్తిస్తే ఇంకోసారి
ఏ పని కోసమూ తన వద్దకు రావద్దని గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.