హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుల స్థానంలో అన్ని సేవలనూ కలిపి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ, విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 28, 2024) సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తిస్తామని తెలిపారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలున్నింటినీ కార్డు వెనుక పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు.
ALSO READ | ఏ వ్యక్తికీ అన్యాయం జరగనివ్వం.. మూసీ నిర్వాసితులకు దానకిషోర్ భరోసా
ప్రస్తుతం అందుబాటులో ఉన్న (రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ) డేటా ఆధారంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం కుటుంబాలను నిర్ధారిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిజిటల్ కార్డులోనే రేషన్, ఆరోగ్య, ఇతర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతి కుమారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఇతర అధికారులు పాల్గొన్నారు.