హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సదర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పాం.. మాటిచ్చినట్లుగానే ఇక నుండి సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం (అక్టోబర్ 27) హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. జ్యోతి ప్రజ్వలన చేసి సదర్ సమ్మేళన వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులను పూజించడం యాదవుల ప్రత్యేకత అని కొనియాడారు. రాష్ట్రంలోని యాదవులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. యాదవ సోదరులు అవకాశాలు అందిపుచ్చుకోండని పిలుపునిచ్చారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. యాదవ సోదరులకు రాజ్య సభలో ప్రాతినిధ్యం కల్పించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని.. దీనిని దృష్టిలో పెట్టుకుని మూసీ పునర్జీవన కార్యక్రమంలో యాదవులు సహకరించాలని కోరారు.
Also Read :- ఫీజ్రీయింబర్స్మెంట్ విడుదలచేయాలని..ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఎస్ఎఫ్ఐ వినతి పత్రం
మూసీ పునర్జీవన ప్రాజెక్ట్‌ను ఎవరూ ఆపలేరని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముషీరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ గెలిస్తే.. ఆయన మంత్రి అయ్యేవారని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ ఓడిపోయినప్పటికీ.. ఆయన కుటుంబానికి తగిన ప్రాధ్యానం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.