ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి: కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి: కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండ‌లంలో స‌ద‌స్సు నిర్వహించాల‌ని, ప్రతి క‌లెక్టర్ మండ‌ల స్థాయి స‌ద‌స్సుల‌కు హాజ‌రై అక్కడ రైతులు, ప్రజ‌లు లేవ‌నెత్తే సందేహాల‌కు వారికి అర్ధమ‌య్యే భాష‌లో వివ‌రించి ప‌రిష్కారం చూపాల‌ని  సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతుల భూ స‌మ‌స్యల శాశ్వత ప‌రిష్కార‌మే ధ్యేయంగా ఎంతో అధ్యయ‌నంతో తీసుకొచ్చిన భూ భార‌తి చ‌ట్టాన్ని (Bhu Bharathi Act) క్షేత్ర స్థాయికి స‌మర్థంగా తీసుకెళ్లాల‌ని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన నిర్ధేశించారు.

సోమవారం (ఏప్రిల్ 14) హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇండ్లు, వేస‌వి తాగు నీటి ప్రణాళిక‌లపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇండ్లను తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామ‌ని, ఈ రెండింటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో క‌లెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని ఆదేశించారు. భూ భార‌తి చ‌ట్టాన్ని క‌లెక్టర్లు స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేయాల‌ని, గ‌తంలో రెవెన్యూ స‌మ‌స్యల ప‌రిష్కారాన్ని ప‌ట్టించుకోకుండా రైతుల‌ను న్యాయ‌స్థానాల‌కు పంపార‌ని, భూభార‌తి చ‌ట్టంలో రెవెన్యూ యంత్రాగ‌మే ఆయా స‌మ‌స్యల ప‌రిష్కారానికి కృషి చేస్తుంద‌ని, అప్పీల్ వ్యవ‌స్థ ఉన్న విష‌యాన్ని రైతులు, ప్రజ‌ల‌కు వెల్లడించాల‌ని  తెలిపారు.

Also Read :- ధరణి తెలంగాణ రైతులకు ఒక పీడ కల

భూ భార‌తి పైలెట్ ప్రాజెక్టు స‌ద‌స్సుల‌ను నారాయ‌ణ‌పేట జిల్లా మ‌ద్దూర్‌, ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట‌, ములుగు జిల్లా వెంక‌టాపూర్ మండ‌లాల్లో నిర్వహిస్తార‌ని, ఆయా మండ‌ల కేంద్రాల్లో స‌ద‌స్సుల‌కు క‌లెక్టర్లు క‌చ్చితంగా హాజ‌రుకావాల‌ని, ఆయా మండ‌లాల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని ఆదేశించారు. ఆయా స‌ద‌స్సుల‌కు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి , ఇత‌ర మంత్రులు హాజ‌రువుతార‌ని తెలిపారు. 

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున గ్రామ స్థాయిలో ఇందిర‌మ్మ ఇండ్ల క‌మిటీలు ఆమోదం పొందిన జాబితాను మండ‌ల స్థాయి క‌మిటీలు ప‌రిశీలించాల‌ని సీఎం సూచించారు. ఆ క‌మిటీల ప‌రిశీల‌న అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపాల‌ని.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదించాకే ఇండ్ల  జాబితా ఖ‌రార‌వుతుంద‌ని స్పష్టం చేశారు. ఈ వ్యవ‌హారం స‌క్రమ ప‌ర్యవేక్షణ‌కు ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రత్యేక అధికారిని నియ‌మించాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిని ఆదేశించారు. ఈ ప్రత్యేకాధికారి ఇందిర‌మ్మ క‌మిటీలు, మండ‌ల క‌మిటీలు, క‌లెక్టర్లు, ఇన్‌ఛార్జి మంత్రి మ‌ధ్య స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉంటార‌ని చెప్పారు. 

వేస‌వి కాలంలో ఎక్కడా తాగు నీటి స‌మ‌స్య త‌లెత్తకుండా క‌లెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని సూచించారు. తాగునీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో నీటి పారుద‌ల శాఖ‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌, విద్యుత్ శాఖ స‌మ‌న్వయంతో ప‌ని చేయాల‌ని చెప్పారు. ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాపై పర్యవేక్షించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ సలహాదారులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.