అంతా రికార్డ్ అవుతోంది.. బయట మాట్లాడొద్దు: ఎమ్మెల్యేలకు CM రేవంత్ వార్నింగ్

 అంతా రికార్డ్ అవుతోంది.. బయట మాట్లాడొద్దు: ఎమ్మెల్యేలకు CM రేవంత్ వార్నింగ్

మంత్రిపదవులపై మాట్లాడొద్దు!
= బయట కామెంట్లు చేయొద్దు
= మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది
= వీకెండ్‌ రాజకీయాలు వద్దు
= ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తుంటే ఏం చేస్తుండ్రు
= ఒక్కరూ సోషల్ మీడియాలో వాడటం లేదు
= అందరూ పల్లెల్లో తిరగాలె.. ప్రజల మధ్య ఉండాలె
= ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ 
= తానూ మే1 నుంచి జనంలోనే ఉంటానన్న సీఎం

హైదరాబాద్: మంత్రి  పదవులపై ఎమ్మెల్యేలెవరూ మాట్లాడొద్దని, బయట కామెంట్లు చేయొవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ శంషాబాద్ నోవాటెల్ లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ  సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు  రావన్నారు. అలా పదవులు వస్తాయనుకుంటే మీకే నష్టమని ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. పదవులు ఇచ్చేది అధిష్టానం అని గుర్తుంచుకోవాలని సూచించారు. 

మొదటి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు.. రెండో సారి విజయం సాధించేలా పనిచేయాలని అన్నారు.  వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం,నియోజకవర్గ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు మొదటిసారి గెలవగానే తాము ఏదో సాధించామన్నట్లు వెంటనే  రిలాక్సేషన్ మూడ్‎లోకి వెళ్ళిపోతున్నారని చురకలు అంటించారు. 

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు వ్యతిరేక ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా వాడటం లేదని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కే పరిమితమవుతున్నారని అన్నారు. వీకెండ్ రాజకీయాలు చేయొద్దని ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు. వచ్చే నెల 1 నుంచి తాను జనంలో తిరుగుతానని చెప్పారు. 

అద్దంకి ఆదర్శం

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీ నేతలంతా పదవుల విషయంలో అద్దంకి దయాకర్ లా ఓపికతో వేచి  చూసే ధోరణి అలవర్చుకోవాలని అన్నారు. ఆయన ఓపిక ఇప్పుడు మనతో కూర్చునేలా చేసిందని అన్నారు. మొదట ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనుకున్నామంటే కుదరలేదని, తర్వాత ఎమ్మెల్సీ ఇద్దామనుకున్నా సాధ్యం కాలేదని, ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారని అన్నారు. ఆయన తన జీతంలో 10% ఏఐసీసీకి, 15% పీసీసీకి ఇస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా ప్రతి నెలా తమ జీతం నుంచి రూ. 20 వేలు ఇవ్వాలని పీసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.