యాదాద్రి, వెలుగు: యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇకపై ఆలయానికి సంబంధించిన అన్ని రికార్డుల్లోనూ యాదగిరిగుట్టగా పేర్కొనాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘‘స్వామి వారి ఆలయం వెలిసినప్పటి నుంచి యాదగిరిగుట్టగానే వాడుకలో ఉంది. కానీ భక్తుల అభిప్రాయానికి విరుద్ధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చింది. భక్తుల అభీష్టం మేరకే యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తున్నం” అని వెల్లడించారు.
శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని సీఎం రేవంత్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. షాపింగ్ కాంప్లెక్స్, వసతి గృహాల నిర్మాణం, కల్యాణకట్ట, పుష్కరిణి, అన్నప్రసాదం కాంప్లెక్స్, బస్టాండ్, ప్రెసిడెన్షియల్ విల్లాస్ తదితర పనుల పురోగతిపై ఆరా తీశారు.
అభివృద్ధి పనులపై ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి బోర్డు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టెంపుల్చైర్మన్పదవికి ప్రాధాన్యమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టెంపుల్ కమిటీతో పాటు ఇతర కమిటీలను పునరుద్ధరించాలని సూచించారు.
గోశాల అభివృద్ధికి పాలసీ..
గోశాలను అభివృద్ధి చేసి గోవులను సంరక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గోవులను భక్తులు దత్తత తీసుకునే విధంగా ప్రత్యేక పాలసీతో పాటు యాప్ రూపొందించాలని సూచించారు. భక్తులు కొం డపై నిద్ర చేసేందుకు వసతి కల్పించాలని, కాటేజీల నిర్మాణంలో దాతల సాయం తీసుకోవాలని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనులన్నీ ఆగమశాస్త్ర ప్రకారం చేయాలన్నారు.
పెండింగ్ పనుల పూర్తికి ప్రణాళిక రూపొందించాలని, దేవాలయానికి సంబంధించిన అన్ని అంశాలతో ఈ నెల 15లోగా మరోసారి సమీక్షకు రావాలని అధికారులను ఆదేశించారు. కాగా, జిల్లాలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీకి మరింత స్థలం కావాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరగా.. మెడికల్ కాలేజీ దేవాలయ పరిధిలోకి వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించి, అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు.
లోపాలను సవరించండి..
టెంపుల్ నిర్మాణంలోని లోపాలను వెంటనే సవరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘ఆలయాన్ని ఆర్అండ్బీ, దేవాదాయ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ తనిఖీ చేసి.. లోపాలపై నివేదిక రూపొందించాలి. నేను కూడా మరోసారి వచ్చి టెంపుల్పనులను పరిశీలిస్తాను. గుడి పనుల విషయంలో రాజీపడేది లేదు. భూసేకరణకు సంబంధించి అన్ని కేసులు క్లియర్ చేయాలి. పరిహారం చెల్లించాలి. పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టడంతో పాటు సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి” అని సూచించారు.
బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి
యాదగిరిగుట్ట ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి టెంపుల్కు వచ్చిన గోల్డ్ కోటింగ్ రేకును సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 10 వేల స్క్వేర్ఫీట్లో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేయనున్నారు. ఇందులో ఈ నెల 15 నాటికి 2 వేల స్క్వేర్ఫీట్వరకు పనులు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నాటికి పనులన్నీ పూర్తి చేయనున్నారు. మార్చి 1 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నందున కుంభాభిషేకం నిర్వహిస్తారు.