CM రేవంత్ ప్రజా జీవితం యువకులకు ఆదర్శం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల: అంచెలంచెలుగా ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువకులకు ఆదర్శమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర పోషించారని కొనియాడారు. శుక్రవారం (నవంబర్ 8) జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవన విధానం, కుల గణన చేపట్టి దేశానికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మూసీ నది ప్రక్షాళన ఆవశ్యకతను తెలిపేందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‎ను తీర్చిదిద్దేందుకు మూసీ ప్రక్షాళన చేపట్టారన్నారు. మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనతో మురికి నీరు శుద్ధిచేసి, నల్గొండకు సాగునీరు అందిస్తామని తెలిపారు. 

Also Read : కేక్‌ కట్‌ చేయిస్తా.. ఛాయ్‌, బిస్కెట్లు ఇస్తా

ఏ పార్టీ కూడా మూసీ ప్రాజెక్ట్ ప్రక్షాళనను వ్యతిరేకించడం లేదని.. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అంటున్నారని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత.. వారికి ఉపాధి కల్పించడంతో పాటు పునరావాసం కల్పిస్తామని భరోసా కల్పించారు. మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్  పార్టీ వైభవం ఇనుమడిస్తుందనే భయంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.