సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం

సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనకు తొలిరోజే విశేష స్పందన లభించింది. సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) తో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. 

పర్యటనలో భాగంగా తొలి రోజు తెలంగాణ రైజింగ్ టీమ్ సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్ ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవెలప్ మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించింది. అక్కడ శిక్షణ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు. 

ALSO READ | 2030 నాటికి మూసీ డెవలప్మెంట్ కంప్లీట్.. టార్గెట్ తో ముందుకెళ్తున్న ప్రభుత్వం..

ఆ తర్వాత ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాదులోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి సహకరించాలని ఐటీఈ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 

స్కిల్ డెవెలప్మెంట్ శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పరం సహకరించుకోవాలన్న సీఎం ప్రతిపాదనకు ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. 

సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్ వీ ఎస్ఎస్ సుబ్బారావు ఈ తెలంగాణ రైజింగ్ టీమ్ లో ఉన్నారు.