ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమిపూజ.. ఎప్పుడంటే

 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమిపూజ.. ఎప్పుడంటే

కొందుర్గ్​లో రేవంత్, మధిరలో భట్టి శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: ఇంటిగ్రేటెడ్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూళ్ల భవన నిర్మాణాలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో ఒకేసారి భవన నిర్మాణాలకు భూమిపూజలు చేయనున్నట్లు సీఎస్ శాంతి కుమారి ప్రకటించారు. గురువారం సెక్రటేరియట్‌‌ నుంచి ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. 

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్‌‌ సెగ్మెంట్​లోని కొందుర్గ్​లో స్కూల్‌‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌‌ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేస్తారని సీఎస్‌‌ తెలిపారు. మిగతా ప్రాంతాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌‌చార్జ్ మంత్రుల ఆమోదంతో శంకుస్థాపన చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాకు చెందిన అందరు ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. 

కొడంగల్, మధిర, చెన్నూరు, మంచిర్యాల, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్​నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆందోల్‌‌, చాంద్రాయణగుట్ట, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ ఘన్‌‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, షాద్‌‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూరు, నర్సంపేట, జడ్చర్ల నియోజకవర్గాల్లో భవన నిర్మాణాల శంకుస్థాపనకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్​లో ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సీఎంవో సెక్రటరీ అజిత్‌‌ రెడ్డి, ఐ అండ్‌‌ పీఆర్‌‌ కమిషనర్‌‌ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.