- రిజర్వేషన్లు కాపాడుతం
- బీజేపీ హిడెన్ ఎజెండాతో పనిచేస్తోంది
- 400 సీట్లొస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంది
- ప్రజలు చైతన్యవంతులైండ్రు ..240 మాత్రమే ఇచ్చారు
- వాళ్లకు అంబేద్కర్ పేరు, రాజ్యాంగం, రిజర్వేషన్లు నవ్వులాట అయ్యాయి
- ఇండోర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇండోర్: కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తుందని, రిజర్వేషన్లు కాపాడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ( జనవరి 27) మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన జై బాపు, జై భీం, జై సంవిధాన్ ర్యాలీకి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, అమిత్ షా రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ 400 సీట్లు అడిగిందని, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు.
ALSO READ | మోడీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే పోతారు: మల్లికార్జున ఖర్గే
ప్రజలు వాళ్ల కుట్రలను గ్రహించే 240 సీట్లకు పరిమితం చేశారని సీఎం రేవంత్ చెప్పారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణ బీజేపీ విధానమని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాటి నుంచి బీజేపీ నేతలు ఆందోళనలో ఉన్నారని అన్నారు. 2025 వాళ్లకు కీలకంగా మారిందని అన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకే తాము జై బాపు, జై భీం, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయమని చెప్పారని, దానికి కట్టుబడే కాంగ్రెస్ పార్టీ పోరాటాలు సాగిస్తోందని అన్నారు. బీజేపీకి అంబేద్కర్ పేరు అన్నా.. రాజ్యాంగం, రిజర్వేషన్లు అన్నా నవ్వులాటగా మారాయని అన్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి తదితరులు ఉన్నారు.