
- డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా..
బూర్గంపహాడ్, వెలుగు: సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు. ఆ కుటుంబం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి హాజరైన అనంతరం ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, సీఎస్ శాంతికుమారి బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామానికి వెళ్లారు. అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అందరితో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు.
కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. భోజన సమయంలో సన్నబియ్యం లబ్దిదారుడు శ్రీనివాస్కుటుంబసభ్యులతో సీఎం రేవంత్ ఆత్మీయంగా మాట్లాడారు. వారి కుటుంబ, ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూరం శ్రీనివాసరావు తల్లి శంకరమ్మ మాట్లాడుతూ.. తన భర్త జీసీసీ సేల్స్ మెన్ గా పనిచేసి 2015లో పదవీ విరమణ పొందాడని, తన కుమారుడు ఎంఏ, బీఈడీ చేసినా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని వివరించారు. తన కూతురు చిన్నప్పటినుంచే మానసిక, కంటిచూపు సమస్యలతో బాధ పడుతున్నదని చెప్పగా.. వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు సీఎం రేవంత్ సూచించారు.
సీఎం భోజనానికి రావడంసంతోషంగా ఉంది: బూరం శ్రీనివాస్
సీఎం రేవంత్ రెడ్డి తమ ఇంటికి భోజనానికి రావడం ఎంతో సంతోషంగా ఉంని బూరం శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి రావడం అసలు ఊహించనిదని, సన్నబియంతో తమలాంటి పేద కుటుంబాలకు ప్రభుత్వం ఎంతో మేలుచేస్తున్నదని చెప్పారు.