రైతన్నకు..కొండంత అండ రేవంత్

రైతన్నకు..కొండంత అండ రేవంత్

‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై... యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్... ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై... ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్’ అనే సంస్కృత ప‌ద్యం మ‌నం త‌ర‌చూ వింటూనే ఉంటాం.  ఏవైనా ఆటంకాలు ఎదురవుతాయేమోన‌న్న భ‌యంతో అధములు అస‌లు ప‌నే మొద‌లుపెట్టరు. ప‌ని ప్రారంభించాక ఏవైనా ఇబ్బందులు వ‌స్తే వ‌దిలేసేవారు మ‌ధ్యములు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే  ప్రారంభించిన కార్యాన్ని రెట్టించిన ఉత్సాహంతో  ధీరులు పూర్తి చేసి తీరుతార‌నేది పైప‌ద్యం అర్థం.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీరుడు.  

ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌నలో రాష్ట్రాన్ని అప్పుల‌ కుప్పగా మార్చి.. ఖ‌జానాను డొల్లగా మార్చివేసిన స‌మ‌యంలో  సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీక‌రించారు. ప‌దేండ్ల  బీఆర్ఎస్ పాల‌నా కాలంలో  రైతు రుణ‌మాఫీని పూర్తి చేయ‌లేక‌పోయారు. రుణ‌మాఫీ చేస్తామంటూ ఏటా కొంత విదుల్చుతూ ప‌దేండ్లపాటు నెట్టుకొచ్చిన చ‌రిత్ర బీఆర్ఎస్ నేత‌ల‌ది. అస‌లు తాము ఇచ్చిన ఏ వాగ్దానాన్ని,  మొద‌లుపెట్టిన ఏ ప‌నిని పూర్తి చేయ‌ని నీచ చ‌రిత్ర బీఆర్ఎస్ పాల‌కుల‌ది.  కాళేశ్వరం, రైతు రుణ‌మాఫీ త‌దిత‌ర విష‌యాల్లో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారంటూ అబ‌ద్ధాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన బీఆర్ఎస్ నేత హ‌రీష్ రావు నిత్యం త‌ప్పుడు మాట‌లు, రాత‌ల‌తో  ప్రజలను పక్కదారి ప‌ట్టించే ప్రయత్నం చేస్తున్నారు...

రైతుల విష‌యంలో రేవంత్ రెడ్డిది నికార్సయిన ప్రేమ‌. క‌చ్చిత‌మైన వైఖ‌రి.  రైతు బిడ్డ రేవంత్ రెడ్డికి అన్నదాత ప్రతి క‌ష్టం. న‌ష్టం ఎరుక‌.  అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెన‌క‌డుగు వేయ‌క రూ.2 ల‌క్షల రుణ‌మాఫీ హామీని నెర‌వేర్చారు.  ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన మాట  మేర‌కు రాష్ట్రంలో 22,22,067 మంది రైతుల‌కు చెందిన రూ.17,869.22 కోట్ల రుణాల‌ను మాఫీ చేశారు. 2024–-25 రాష్ట్ర బ‌డ్జెట్‌లో  రుణ‌మాఫీకి ఏకంగా రూ.26 వేల కోట్లు కేటాయించారు. 

కుటుంబ నిర్ధార‌ణ‌, ఇత‌ర సాంకేతిక స‌మ‌స్యలు ఎదురైనవారికీ రుణ‌మాఫీ చేస్తామ‌ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రుణ‌మాఫీ చేసేందుకు రూ.31 వేల కోట్లు వెచ్చించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంది.  ప‌దేండ్ల త‌న మామ  కేసీఆర్ పాల‌న కాలంలో ఎంతమంది రైతుల రుణ‌మాఫీ చేశారో హ‌రీష్ రావు వెల్లడించాలి. ఆ ప‌దేండ్ల కాలంలో ఎన్ని విడ‌త‌లుగా రుణ‌మాఫీకి నిధులు విడుద‌ల చేశారో కూడా చెప్పాలి.   ప‌దేండ్ల త‌మ పాల‌నా కాలంలో రుణ‌మాఫీలో  బీఆర్ఎస్ ప్రభుత్వం విఫ‌ల‌మైనందునే  రైతులు శాస‌న‌స‌భ, లోక్‌స‌భ  ఎన్నిక‌ల్లో  క‌ర్రుకాల్చి వాత‌పెట్టారనే విష‌యాన్ని హ‌రీష్ రావు ఇప్పటికైనా గుర్తించాలి. 
 

కమీషన్ల కక్కుర్తితో కుంగిన కాళేశ్వరం

కాళేశ్వరం విష‌యంలో  రేవంత్ రెడ్డి త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నిత్యం అబద్ధపు ప్రచారం చేస్తున్నది హ‌రీష్ రావు,  బీఆర్ఎస్ నాయ‌కులే.  ప్రాణ‌హిత‌-– చేవెళ్ల పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టును పక్కనపెట్టి. క‌మీష‌న్ల క‌క్కుర్తితో కాళేశ్వరంను తెర‌పైకి తెచ్చింది బీఆర్ఎస్  పాల‌కులే.  ఉమ్మడి ఆదిలాబాద్‌,  రంగారెడ్డి  జిల్లాల‌కు సాగునీటి  రాకుండా కుట్ర చేసింది  బీఆర్ఎస్  ప్రభుత్వమే.  అంచ‌నాలు పెంచుతూ  కాళేశ్వరం  రూ.ల‌క్ష కోట్ల వ‌ర‌కు తీసుకెళ్లింది వంద‌కు వంద శాతం క‌మీష‌న్ల కోస‌మేన‌నేది తెలంగాణ బిడ్డలంద‌రికీ తెలుసు. వ‌ర‌ద‌తో కాళేశ్వరం పంపుహౌస్‌లు మునిగిన‌ప్పుడు  ప్రతిప‌క్షాల‌ను, మీడియాను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్న దుర్మార్గపు ప్రభుత్వం బీఆర్ఎస్‌ది.  శాస‌న‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం కావడంతో  మేడిగ‌డ్డ కుంగిన అంశం బ‌య‌ట ప్రపంచానికి తెలిసింది.  లేకుంటే దానిని అత్యంత ర‌హ‌స్యంగానే ఉంచేవారు.  

కాంగ్రెస్ హ‌యాంలో ద‌శాబ్దాల క్రిత‌మే క‌ట్టిన నాగార్జున సాగ‌ర్‌,  శ్రీ‌శైలం, దిగువ మానేరు జ‌లాశ‌యం (ఎల్ఎండీ) ఇప్పటికీ చెక్కుచెద‌ర‌లేదు. నీటి పారుద‌ల శాఖ మంత్రిగా హ‌రీష్ రావు,  సీఎంగా ఆయ‌న మామ కేసీఆర్ కాలంలో క‌మీష‌న్ల కక్కుర్తితో క‌ట్టిన కాళేశ్వరం మాత్రం అప్పుడే కుంగిపోయింది. దీనిపై హ‌రీష్ రావు స‌మాధానం చెప్పాలి. అన్నింటికి మించి ఈ ఏడాది కాళేశ్వరం  నుంచి ఒక్క చుక్క నీరును రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయ‌లేదు. కాంగ్రెస్ హయాంలోనే క‌ట్టిన శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి నుంచి కాంగ్రెస్ హయాంలోనే క‌ట్టిన ఎల్ఎండీకి నీరును ఎత్తిపోశారు. ఎల్ఎండీ.. పైభాగంలో త‌ర్వాత కాలంలో క‌ట్టిన ఇత‌ర ప్రాజెక్టుల‌కు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప‌నుల ఆధారంగానే నీటి ఎత్తిపోత‌లు జ‌రిగాయి. ఈ విష‌యాల‌ను హ‌రీష్ కాద‌న‌గ‌ల‌రా?  

రైతులకు బేడీలు వేసిన బీఆర్ఎస్

కాంగ్రెస్ కారుమబ్బులు కమ్ముకున్న తర్వాత వెలుగు జిలుగుల తెలంగాణ వెలవెలబోతున్నదంటూ హ‌రీష్ రావు మొస‌లి క‌న్నీరు కార్చారు.  హ‌రీష్‌రావుకు జ్ఞాప‌క‌శ‌క్తి  త‌క్కువ కావ‌డ‌మో లేక ప్రజల  జ్ఞాప‌క‌శ‌క్తిపై బాగా చిన్నచూపు ఉంటేనో త‌ప్ప అలాంటి త‌ప్పుడు రాత‌లు రాయ‌రు.  తెలంగాణపై ‘కారు’మ‌బ్బులు క‌మ్ముకున్న కాలం బీఆర్ఎస్ హ‌యాంలోనే జరిగింది.  ఖ‌మ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల‌కు బేడీలు వేసి న‌డిపించిన విష‌యం, అట‌వీ ప‌ట్టాలు అడిగిన గిరిజ‌న రైతుల‌ను లాఠీల‌తో త‌రిమికొట్టిన రోజులు...మ‌ల్లన్న సాగ‌ర్ ముంపు స‌మ‌యంలో వేముల‌ఘాట్‌లో  సొంత‌ంగా చితి పేర్చుకొని రైతు తూటుకురి మ‌ల్లారెడ్డి స‌జీవ ద‌హ‌నం చేసుకుంది..  భూములు లాక్కొని ప‌దుల గ్రామాల రైతుల‌ను చిత్రహింసలకు గురిచేసింది బీఆర్ఎస్ పాల‌నా కాలంలోనే.. ఆ దుర్మార్గపు పాలనా కాలాన్ని అప్పుడే హ‌రీష్ రావు మ‌ర్చిపోయారా?  తెలంగాణ‌ను పోలీసు రాజ్యంగా మార్చి రైతుల‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయించి వేధించిన దుర్మార్గపు చరిత్ర మీది కాదా హ‌రీష్ రావు?

అబద్ధాల ‘అంబాసిడ‌ర్’ హ‌రీష్‌

రేష‌న్ కార్డు లేద‌నే సాకుతో రుణ‌మాఫీ చేయ‌డం లేద‌ని హ‌రీష్ రావు ఆరోపించారు?  రేషన్ కార్డు లేకున్నా రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్రభుత్వం ప్రకటించింది.  అందుకు సంబంధించి కుటుంబ నిర్ధారణ చేస్తోంది.  అందులో త‌ప్పేం ఉంది.  ద‌శాబ్దాల క్రితం అమ్ముకున్న భూముల‌కు సంబంధించి దొర‌ల‌కు తిరిగి ప‌ట్టాలు చేసిన ధ‌ర‌ణి మాదిరిగానే ప్రజా ప్రభుత్వం ప‌ని చేయాలని మీరు కోరుకుంటున్నారా? మీ సొంత నియోజ‌వ‌క‌ర్గం సిద్దిపేట‌లోనే  రూ.160 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అవీ అబ‌ద్ధమంటావా హ‌రీష్‌రావు. అస‌లు అబ‌ద్ధాలు.. అవాస్తవాలకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్  హ‌రీష్ రావు. బీఆర్ఎస్ చెప్పిన‌ట్లు ద‌ళితుణ్ని ముఖ్యమంత్రిని చేయ‌లేదు.. రాష్ట్రమంతా డ‌బుల్ బెడ్రూమ్ ఇండ్లు క‌ట్టించ‌లేదు. రుణ‌మాఫీని చేయ‌లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ అబద్ధాలకు లెక్కే లేదు.  వాట‌న్నింటిని నిత్యం ప్రచారం చేసిన ‘అంబాసిడ‌ర్’ హ‌రీష్‌రావు.  పైగా దొంగే దొంగ అన్నట్లు ఇప్పుడు ఎక్కడ లేని సుద్దులు చెబుతున్నారు.

మన కాల‌పు  రైతు నేత రేవంత్‌ 

రైతుల విష‌యంలో రేవంత్ రెడ్డి దేశానికి బ్రాండ్  అంబాసిడ‌ర్‌.  చౌద‌రి చ‌ర‌ణ్​సింగ్‌, దేవీలాల్‌,  మ‌హేంద్ర సింగ్ టికాయత్,  ఎన్‌.జి.రంగా, బినోయ్ కృష్ణ కోనార్‌,  ప్రొఫెస‌ర్ నంజుండ‌స్వామి, కె.ఎస్‌. పుట్టణయ్య  దేశమంతా గుర్తింపుపొందిన‌ రైతు నేత‌లు.  త‌మ జీవిత‌కాల‌మంతా  రాజ‌కీయాల్లో గెలుపోట‌ముల‌తో  సంబంధం లేకుండా రైతు స‌మ‌స్యల ప‌రిష్కారానికి పోరాడిన ధ‌న్యులు వారు. వీరిలో చ‌ర‌ణ్‌సింగ్‌, దేవీలాల్ ముఖ్యమంత్రుల‌య్యారు. ఇప్పుడు ఆ రైతు నేత‌ల స‌ర‌స‌న  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరారు.  రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన రేవంత్ రెడ్డికి అప్పులతో ఆ కుటుంబాలు ఎంత‌గా కుంగిపోతాయో పూర్తిగా తెలుసు.  ఇప్పటివ‌ర‌కూ  రైతు నేత‌లు  రైతు స‌మ‌స్యల ప‌రిష్కారానికి పోరాడారు.  కానీ, రేవంత్ రెడ్డి  రైతుల క‌ష్టాన్ని ఏక‌కాలంలో తీర్చి వేశారు.  ఇప్పుడు భార‌త‌దేశంలో మ‌న కాలంలో ఉన్న ఏకైక రైతు నేత  రేవంత్ రెడ్డి అని చ‌రిత్ర రుజువు చేస్తోంది.

- ఈర‌వ‌త్రి అనిల్‌, చైర్మన్, టీజీఎండీసీ-