ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణపై ప్రకృతి దాడి చేసిందన్నారు.వరద ఉధృతికి ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని తెలిపారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటూ... ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆస్తినష్టం.. ప్రాణనష్టాన్ని నివారించామన్నారు. మూడు రోజులుగా మంత్రులు.. అధికారులు ప్రజలతోనే ఉన్నారన్నారు.
అంటు రోగాలు విస్తరించకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్ అన్నారు. 48 గంటలుగా ప్రభుత్వ అధికారులు కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. విజయవాడ కంటే ఖమ్మంలోనే ఎక్కువ వరద తాకిడి ఉందని సీఎం రేవంత్ అన్నారు. వరదతో దెబ్బతిన్న ప్రాంతాను పునర్ నిర్మిస్తామన్నారు. విపత్తు సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Also Read :- ‘తెలంగాణకు రండి’.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండి.. కేవలం ట్విట్టర్ లో మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు అండగా ఉన్న మంత్రులను చిల్లరగా విమర్శించడం సరికాదని కేటీఆర్కు చురకలంటించారు. మంచి చేయాలనే ఉద్దేశం లేకపోతే ఫాంహౌస్ పడుకోండి.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్వార్ద రాజకీయాలు చేయవద్దన్నారు. పదేండ్లు ముఖ్యమంత్రి అనుభవం ఇందుకేనా అని ప్రశ్నించారు.
తెలంగాణను ఆదుకోవాలని ప్రధానికి, హోంమంత్రికి విఙ్ఞప్తి చేశామన్నారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. తెలంగాణకు 5 వేల 430 కోట్ల రూపాయిల మేరకు నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. భేషజాలకు పోకుండా ప్రధాని నిధులను విడుదల చేయాలని కోరారు.