- ఒక్క ప్రాజెక్టు కట్టలే.. ఎన్నికల హామీలు తీర్చలే: కేటీఆర్
- ఆ పైసలన్నీ ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన 10 నెలల కాలంలో రూ.80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘అప్పు- తప్పన్నోళ్లని ఇప్పుడు దేనితో కొట్టాలి?’ అని ప్రశ్నించారు. ఎన్నికల హమీలు తీర్చలేదని, కొత్త సాగునీటి ప్రాజెక్టులేవీ కట్టలేదని, మరి 80 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయని ట్విట్టర్(ఎక్స్) వేదికగా అడిగారు. ‘‘బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ఆ పైసలన్నీ ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ? బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టాం. మౌలిక సదుపాయాలు పెంచాం. పదేండ్ల కష్టాలను తీర్చాం” అని పేర్కొన్నారు. అప్పు శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టిన సీఎం రేవంత్ అవే అప్పుల కోసం పాకులాడటమేంటి? అని ప్రశ్నించారు. తెస్తున్న అప్పుల అడ్రస్ ఎక్కడ ? అని అడిగారు. సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరమని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదమని అన్నారు. అలాగే, పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైందని, పెండ్లికి తులం బంగారం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సారి కూడా తులం బంగారం తూచేనా అని ప్రశ్నించారు. గోల్డ్ షాపుల్లో స్టాక్ లేదా? లేకుంటే బంగారు గనుల్లో తవ్వకాలు ఆగిపోయాయా? అని ఎద్దేవా చేశారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలి
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ. 650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ లపై ఆధారపడిన దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతుందని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ కేటీఆర్ ను తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ కోరింది. తెలంగాణ భవన్ లో బుధవారం కేటీఆర్ ను కలిసి, వినతిపత్రం అందజేసింది. ప్రతిపక్ష పార్టీగా ఫీజు బకాయిల విడుదలకు కొట్లాడుతామని అసోసియేషన్‌కు కేటీఆర్ భరోసా ఇచ్చారు.