తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది .. అది వదిలించే పనిలోనే ఉన్నాం: సీఎం రేవంత్​

తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది .. అది వదిలించే పనిలోనే ఉన్నాం: సీఎం రేవంత్​
  • ప్రధానిని 6 గ్యారంటీలు అడుగుతలేం
  • కేంద్రం ప్రకటించిన రీజినల్​ రింగ్ ​రోడ్డు, మెట్రో ప్రాజెక్టులనే అడుగుతున్నం
  •  వీటికోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డి కోరారా?
  • గవర్నర్ ప్రసంగానికి కాదు.. సభలో చర్చకు కేసీఆర్​ రావాలి 
  • గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం.. నేనేంటో హైకమాండ్​కు తెలుసు
  • ఇచ్చిన మాట నిలుపుకుంటా..  పదవుల విషయంలో ఈక్వేషన్స్​ చూడనని వెల్లడి 
  • ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ​చిట్​చాట్​

న్యూఢిల్లీ, వెలుగు: పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తుప్పు పట్టించిందని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఇప్పుడిప్పుడే ఆ తుప్పును వదిలిస్తూ ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రైతుల పొలాలు ఎండిపోతుంటే.. టన్నెల్ లో కార్మికుల ప్రాణాలు పోతుంటే.. ప్రజలు కష్టాల్లో ఉంటే.. బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు.. అసెంబ్లీలో చర్చలకు రావాలని కేసీఆర్​కు సవాల్ విసిరారు. 

డీ లిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ అని విమర్శించారు. గురువారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23 అధికారిక నివాసంలో  మీడియాతో సీఎం రేవంత్​ చిట్ చాట్ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి తో భేటీకి ముందు మీడియాతో  మాట్లాడుతూ, పదేండ్ల పాలనకు అలవాటు పడ్డ అధికారులు.. వ్యవస్థను రాత్రికి రాత్రే అంతా సెట్‌ చేయాలి అంటే కుదరదని,  అలా చేస్తే ఒక్కసారిగా సిస్టం అంతా కొలాప్స్​ అవుతుందని చెప్పారు. 

మాజీ సీఎంలు వైఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, చంద్రబాబు.. ఇలా ఎవరి పాలన చూసినా గత పాలకులు పరిపాలించిన దానిని సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికే రెండేళ్లు సమయం పట్టిందని గుర్తు చేశారు.  తొలి రెండేండ్లు ఇలా సర్దేందుకే సరిపోతుందని, మరో రెండేండ్లు పని చేయాల్సి ఉంటుందని, చివరి ఏడాది ఎన్నికలకు సన్నద్ధం కావాల్సి ఉంటుందని అన్నారు. 

తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి ప్రశ్నించారా?

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  నిధులు, ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తాలి. ఆయా రాష్ట్రాలకు అండగా నిలవాలి. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. 

కానీ మన కిషన్ రెడ్డి మాత్రం అలా కాదు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలేమీ ఆయన పట్టించుకోరు’’ అని విమర్శించారు. ‘‘నేను సీఎంని కాబట్టే కదా? అందరూ నన్నే అనేది. మరి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రానికి ఆయన తెచ్చింది ఏంటి? చేసింది ఏంటి? అని అడగడంలో తప్పేం ఉంది? కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారు?  మూసీ, ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? మెట్రో విషయంపై కేంద్రంతో కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని ప్రశ్నించారు. 

ఈ ప్రాజెక్ట్ లపై  ప్రధాని మోదీతో కిషన్​రెడ్డి మాట్లాడి అనుమతులు తెప్పిస్తే.. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతుందని చెప్పడానికి కేంద్ర మంత్రుల తీరే నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి మాట్లాడరని, మరో మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక నిస్సహాయ మంత్రి అని మండిపడ్డారు. రాష్ట్రంలో అప్పు ఉంది కాబట్టే దానిపై తాను మాట్లాడుతున్నానని చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? అని ప్రశ్నించారు.  

బీజేపీది హిడెన్ అజెండా 

హిందీ జాతీయ భాష ఏమీ కాదని, దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాష మాత్రమేనని  సీఎం రేవంత్​ అన్నారు. అలాంటి హిందీని దేశ ప్రజలపై రుద్దడంలో బీజేపీది రహస్య అజెండా అని వ్యాఖ్యానించారు. త్రిభాషా విధానాన్ని రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పుబట్టారు. ‘‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికంగా తెలుగు, బెంగాల్ మాట్లాడుతారు. మీరు హిందీ మాట్లాడతారు కదా?..  అందరూ అదే మాట్లాడాలి అంటే ఎలా?  అందుకే హిందీ భాషను మనపై రుద్దడంలో ఏదో రహస్య అజెండానే ఉంది’’  అని వ్యాఖ్యానించారు. 

ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో రాష్ట్రం నంబర్ వన్ 

ఓన్ టాక్స్ రెవెన్యూ కలెక్షన్లలో తెలంగాణ  దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం రేవంత్​ చెప్పారు. ద్రవ్యోల్బణం 1.3 శాతానికి తగ్గిందని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో నిరుద్యోగం 8.8 శాతం నుంచి 6.1 కు తగ్గించినట్టు చెప్పారు. ఈ లెక్కలు తాము చెబుతున్నవి కాదని, సోషల్ ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలని వెల్లడించారు. సీఎంగా తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చానని గుర్తు చేశారు. అయితే, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను పట్టించుకోనని, ఎవరి ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పడబోనని స్పష్టం చేశారు. 

డీలిమిటేషన్ తో యూపీలో పార్లమెంట్ సీట్లు 80 నుంచి 120 పెరిగితే, తమిళనాడులో 39 నుంచి 60కి మాత్రమే పెరుగుతాయని చెప్పారు. అంటే.. యూపీలో 40 సీట్లు పెరిగితే, తమిళనాడులో 21 సీట్లు మాత్రమే పెరుగుతాయని, ఇలా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. రాష్ట్రంలో వినూత్నంగా ‘‘రైజింగ్ తెలంగాణ– భారత్ సమ్మిట్’’ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

 అమెరికా మాజీ ప్రెసిడెంట్​ బరాక్ ఒబామాతో పాటు సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ సమ్మిట్ నిర్వహించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ‘‘పొలిటికల్ క్లియరెన్స్’’ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.  అందుకోసమే విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో భేటీ అవుతున్నట్టు చెప్పారు.

ఎమ్మెల్సీతో విజయశాంతికి న్యాయం 

ఎమ్మెల్సీ సీటుతో విజయశాంతికి సముచిత న్యాయం చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు ఆమె పోటీకి దూరంగా ఉన్నారని తెలిపారు. పార్టీ గెలుపుకోసం క్యాంపె యిన్ చేశారని,  నిబద్ధతతో  కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టు చెప్పారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ల అమల్లో భాగంగా ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం సరైందిగా భావించి నట్టు తెలిపారు. 

పదవుల విషయంలో తాను ఈక్వేషన్స్​ చూడనని అన్నారు. పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు ఏదైతే మాట ఇచ్చానో.. అదే మాటపై నిలబడ్డానని, సీఎం అయ్యాక ఆ మాటకు కట్టుబడి పదువులు ఇచ్చినట్టు చెప్పారు. ‘‘అధికారంలోకి వచ్చాక చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ల గురించి నేను ఆలోచించను. 

పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తుంచుకుని మరీ పదవులు ఇవ్వాలి. అదే నేను చేశా. అధికారంలోకి వచ్చాక పార్టీ డీసీసీలు, అనుబంధ సంస్థలకు చెందిన 37 మందికి చైర్మన్ పదవులు ఇచ్చాం’’ అని తెలిపారు. ఇప్పుడు సీఎం హోదాలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నట్టు తెలిపారు.

నాకు ఆ కెపాసిటీ ఉంది..

తానేంటో కాంగ్రెస్​ హైకమాండ్ కు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  గాంధీ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తాను గాలితో గొట్టుకుపోయే వాణ్ని కాదని, తనకు ఆ గాలిని సైతం ఆపగల పవర్​ ఉన్నదని అన్నారు. 

అవసరమైతే ఖర్గే, రాహుల్ గాంధీతో మాట్లాడి.. తనకు కావాల్సింది తెచ్చుకునే కెపాసిటీ ఉన్నదని చెప్పారు.  ‘‘ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను పట్టించుకోను. గాంధీ కుటుంబంతో మీరందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది. నేనెవరో తెలియకపోతే పీసీసీ చీఫ్, సీఎం ను ఎలా చేస్తారు? కలిసిన ప్రతిసారి ఫొటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు.  ఫొటోలు ఉంటేనే వారితో సాన్నిహిత్యం ఉందనుకోవడం తప్పు’’ అని పేర్కొన్నారు.  

ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం..

పదేండ్ల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదని, కానీ, తాను మాత్రం టూరిజం, రెవెన్యూ, ఇలా అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు సీఎం రేవంత్​ చెప్పారు. ఇక చరిత్రలో ఎవరూ చేయలేని ఎస్సీ వర్గీకరణ,  కులగణన, రూ. 2 లక్షల వరకు రుణమాఫీని చేసి చూపామని చెప్పారు. ‘మరి ఏపీలో ఉన్నది ఎన్డీయే సర్కారే కదా? అక్కడ వాళ్లు ఎందుకు చేయడం లేదు’ అని ప్రశ్నించారు.  ‘

‘సీఎం అయిన మొదటి 6  నెలలు ఎన్నికలతోనే ముగిసింది. నేను సీఎంగా పనిచేసింది ఈ 8 నెలలే.. ఈ టైంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. రైతులకు రూ.25 వేల కోట్లు రుణమాఫీ చేశాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినం. 500కే సిలిండర్​ఇస్తున్నం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌ ఇస్తున్నం. ఆరోగ్య శ్రీ లిమిట్​ను రూ.10 లక్షలకు పెంచినం,” అని వివరించారు. తాను 2029 ఎన్నికలకు వెళ్లినప్పుడు.. ప్రజలే తన పనితీరును గుర్తించి, అండగా నిలుస్తారని అన్నారు.