- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- సిరిసిల్లలో నిర్మించిన ఎస్పీ బిల్డింగ్ ఓపెనింగ్
- గుడి చెరువులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు హాజరు
- భారీ జన సమీకరణపై జిల్లా నేతల దృష్టి
వేములవాడ/హైదరాబాద్, వెలుగు:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కొత్త భవనాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో జనసమీకరణపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ ఝా, మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. ఆ తర్వాత రూ.76 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లకు, రూ. 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు పునాది రాయి వేస్తారు. అలాగే, మెడికల్ కాలేజ్ హాస్టల్, అన్నదాన సత్రం, కోనరావుపేట మండలంలో హైలెవల్ బ్రిడ్జి, రూ.3 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు.
అదేవిధంగా, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.26 కోట్లతో నిర్మించిన ఎస్పీ బిల్డింగ్, రూ.1.45 కోట్లతో వేములవాడలో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్, రూ.4.80 కోట్లతో కట్టిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనాలను ప్రారంభిస్తారు. తర్వాత గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతారు. అనంతరం.. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన 17 బాధిత కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారం, 631 శివశక్తి మహిళా సంఘాల కు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు అందజేస్తారు.
- సీఎం టూర్ షెడ్యూల్
- హైదరాబాద్ నుంచి ఉదయం 9:45 గంటలకు రేవంత్ హెలికాప్టర్‌లో బయల్దేరి.. వేములవాడ గుడి చెరువులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
- ఉదయం 9:55 నుంచి 10.10 వరకుగెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నారు.
- ఉదయం 10:10 నుంచి 11.45 మధ్యలో వేములవాడ రాజన్న దర్శనం, అభిషేకం ప్రత్యేక పూజలు (ధర్మగుండం వద్ద, పూర్ణకుంభ స్వాగతం, కోడె మొక్కులు,శ్రీ లక్ష్మీ గణపతి వద్ద అర్చన, స్వామివారికి అభిషేకం, అమ్మవారికి పూజ, ఆశీర్వచనం, పట్టువస్త్రాల సమర్పణ)
- ఉదయం 11.55 నుంచి 12.15 వరకు గెస్ట్ హౌస్ కి..
- మధ్యాహ్నం 12.30 నుంచి 1.40 వరకు పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన. అనంతరం బహిరంగ సభలో ప్రసంగం
- మధ్యాహ్నం 1.45 గంటలకు హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం