పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం రివ్యూ

పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం రివ్యూ
  • కులగణన, రిజర్వేషన్లపై చర్చ

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సీఎం రేవంత్ రివ్యూ చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు జరపాలంటే లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి. కుల గణన చేసిన తరువాతే రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున వీటిపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఈ నెల 15న బీసీ రిజర్వేషన్ల పెంపు, కులగణనపై బీసీ కమిషన్ చైర్మన్, లా సెక్రటరీ, పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి ఆ శాఖకు సుధీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డితో సీఎం చర్చించారు.  కులగణనపై ప్రభుత్వం జీవో ఇచ్చి రూ. 150 కోట్లు కేటాయించింది. 

గణనకు గైడ్ లైన్స్ ఖరారు అయినప్పటికీ సుమారు ఐదున్నర నెలలు టైమ్ పడుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో  త్వరలో మరోసారి సమావేశం అవుదామని సీఎం అధికారులకు తెలిపారు. కులగణన లేకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని గత రివ్యూలో అధికారులను ఆదేశించారు. అలాగే, నేడు జరగనున్న రివ్యూలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

శుక్రవారం రివ్యూలో ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటే  వచ్చే నెల 1న జరగనున్న కేబినెట్​ మీటింగులో ఆ అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ నెలతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల టర్మ్ ముగిసి 6 నెలలు ముగుస్తుంది. ఈ నెలతో జడ్పీటీసీ, ఎంపీటీసీల టర్మ్ సైతం ముగిసింది. లోకల్ బాడీల్లో మూడు వ్యవస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్, అక్టోబర్ లో గ్రామ పంచాయతీలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.