నల్గొండ అర్బన్, వెలుగు: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖను సీఎం రేవంత్ అవమానించారని, వాళ్లిద్దరికీ వెంటనే సారీ చెప్పాలని ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం యునైటెడ్ ఫూలే ఫ్రంట్, భారత జాగృతి ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధన పేరుతో నల్గొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్రవర్ణాల నేతలు ఎక్కువ ఎత్తులో కూర్చొని, బలహీన వర్గాల నేతలను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం అవమానించడమే అన్నారు. అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతిపత్రం ఇస్తే దళితుడికి వినతిపత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారని ఆరోపించారు. ఉద్యోగాల్లో మహిళలకు 47 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.
గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ ఇచ్చిన జీవోను కాంగ్రెస్ వాళ్లు తీసేశారని మండిపడ్డారు. లోకల్ బాడీ ఎన్నికలకంటే ముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు క్లాక్ టవర్ సెంటర్ లోని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సుంకరి మల్లేశ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, చీర పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్, దూదిమెట్ల బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.