బెంగుళూరు: కర్నాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘శక్తి’ పథకాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఎత్తివేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తు్న్నాయి. ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్‌తో కర్నాటక ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. తిరిగి ఆర్టీసీని నష్టాల నుండి గట్టేక్కించడానికి శక్తి స్కీమ్‌ను రద్దు చేయడం ఒక్కటే మార్గామని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో మహిళల ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ ఎత్తివేత వార్తలపై సిద్ధరామయ్య స్పందించారు. గురువారం (అక్టోబర్ 31) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు. శక్తి పథకం రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలన్నీ ఊహాగానాలేనని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. శక్తి పథకాన్ని పునఃసమీక్షించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు.
ALSO READ | క్రాకర్స్‌పై బ్యాన్‌లో మత కోణం లేదు: కేజ్రీవాల్
ఫ్రీ బస్ జర్నీ స్కీమ్‌ను రద్దు చేసే ఉద్దేశం.. అలాంటి ప్రతిపాదన మా వద్ద లేదని తేల్చిచెప్పారు. ‘‘వాస్తవానికి కొందరు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు పూర్తిగా ఉచితం కాకుండా.. టికెట్ రేట్లో 5 నుండి 10 శాతం చెల్లించేందుకు రెడీగా ఉన్నారు.. దీనిపై మేం చర్చిస్తాం’ అని కర్నాటక కాంగ్రెస్ చీఫ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. డీకే కామెంట్స్‌తో సిద్ధరామయ్య సర్కార్ ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ రద్దు చేస్తారంటూ వార్తలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో శక్తి పథకంపై సీఎం సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో శక్తి పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద.. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు 2023, జూన్ 11న శక్తి పథకాన్ని సిద్ధరామయ్య సర్కార్ ప్రారంభించింది.