హంపి గ్యాంగ్ రేప్ ఘటనపై CM సిద్ధరామయ్య సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు

హంపి గ్యాంగ్ రేప్ ఘటనపై CM సిద్ధరామయ్య సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు

బెంగుళూరు: కర్నాటకలోని హంపిలో దారుణం జరిగింది. విదేశీ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ దేశ పౌరురాలితో పాటు.. మరో మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళల వెంట ఉన్న ముగ్గురు యువకులపైన దాడి చేశారు. ఈ ఘటనపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. మహిళలపై సామూహిక అత్యాచారాన్ని హేయమైన నేరంగా అభివర్ణించిన సీఎం.. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 

‘‘కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలోని సనపూర్‌లో ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్‌స్టే యజమానిపై జరిగిన దారుణమైన దాడి, అత్యాచారం చాలా దారుణమైన నేరం. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులను తక్షణ చర్య తీసుకోవాలని.. కఠినమైన దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించాను. అలాగే.. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించాను. పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మన రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకులు సహా ప్రతి వ్యక్తి భద్రతకు కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. 

ALSO READ | ఇండియా పరువు తీశారు.. కర్ణాటకలో ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్ రేప్

కాగా,  29 ఏళ్ల హోమ్‌స్టే నిర్వాహకురాలితో పాటు, ఇజ్రాయెల్ పౌరురాలు, ముగ్గురు పురుష పర్యాటకులు మార్చి 6వ తేదీ రాత్రి నక్షత్రాలను వీక్షించడానికి సనపూర్ సరస్సు సమీపంలోని తుంగభద్ర కాలువకు వెళ్లారు. కాలువ దగ్గర కూర్చుని గిటార్ వాయిస్తూ నక్షత్రాలను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి వద్దకు వచ్చిన ముగ్గురు దుండగులు ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్‌స్టే నిర్వాహకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

బాధిత మహిళల వెంట వచ్చిన ముగ్గురు వ్యక్తులను కాలువలోకి తోసేసి ఈ దారుణానికి ఒడిగట్టారు దుండగులు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం సెక్షన్ల కింద నిందితులపై  గంగావతి గ్రామీణ పోలీస్ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.