బ్యాడ్ న్యూస్.. రెండు నెలల క్రితమే బీర్ల ధరలు పెంచారు.. ఇప్పుడు మళ్లీనా?

బ్యాడ్ న్యూస్.. రెండు నెలల క్రితమే బీర్ల ధరలు పెంచారు.. ఇప్పుడు మళ్లీనా?

మద్యం ప్రియులకు షాక్.. బీర్లు, లిక్కర్ ధరలు మరింత భారంగా మారనున్నాయి. మొన్ననే పెంచారు..ఇప్పుడు మళ్లీనా..ఇలా బీర్లు, లిక్కర్ ధరలు పెంచుతూ పోతే ఎలా అని మద్యంప్రియులు వాపోతుంటే.. ధరలు పెరిగినకొద్దీ అమ్మకాలు తగ్గుతాయేమోనని వైన్స్ షాపులోళ్లు భయపడుతున్నారు. కర్ణాటకలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించడంతో మద్యం ప్రియులు తమ జేబులకు మరో పెద్ద బొక్క తప్పదని  అంటున్నారు.  

కర్ణాటక ప్రభుత్వం మద్యం ప్రియులకు షాకిచ్చింది. మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. 650 ఎంఎల్ బాటిల్ బీరు ధర ప్రీమియంలను బట్టి 10నుంచి 45 రూపాయలు పెంచనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం(మార్చి7) కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టిన సీఎం సిద్ధరామయ్య మరోసారి మద్యం ధరలను సమీక్షించనున్నట్లు తెలిపారు. 

2024లో కర్ణాటకలో మద్యం అమ్మకాలు 36వేల 500 కోట్లుగా ఉంది.. ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని 40వేల కోట్లకు లక్ష్యంగా పెట్టుకుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ ఏడాది జనవరి 20న బీరు సుంకాలు పెంచడంతో బీరు ప్రియులు ఇప్పటికే ధరల పెరుగుదల భారాన్ని ఎదుర్కొంటున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ ఎక్సైజ్ శాఖలో ఆదాయ లోటును పూడ్చడానికి ఈ పెంపు అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో బిల్లింగ్ ధరపై ఎక్సైజ్ డ్యూటీ 185శాతం నుంచి 195 శాతానికి పెంచనున్నారు. లేదా లీటర్ కు 130 రూపాయలు పెంచనున్నారు. దీని ప్రకారం.. ఇప్పుడు 100రూపాయలున్న బాటిల్ ధర రూ. 145లకు చేరనుంది. 230రూపాయలున్న బాటిల్ ధర రూ. 245కు  పెంచనున్నారు. 

అయితే మద్యం ధరలు పెరుగుదలపై అటు వైన్స్ షాపుల ఓనర్లు, ఇటు మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. రేట్లు పెంచితే బీరు అమ్మకాలు కనీసం 10శాతం  తగ్గవచ్చని మద్యం విక్రేతలు భయపడుతున్నారు. గత వారం రోజులుగా బీర్ల సరఫరా లేదు. ప్రభుత్వం నిర్ణయంతో వ్యాపారం దెబ్బతింటోందని అంటున్నారు.