కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య మే 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎంగా సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్యతోపాటు డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్టానం నుంచి ఓ క్లారిటీ రావటంతో.. కర్ణాటకలో రాజకీయ టెన్షన్ కు తెరపడినట్లైయింది. అయితే డీకే వర్గీయులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. సీఎం రేసులో ఉన్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు.. కీలక శాఖల బాధ్యతలను అప్పగిస్తూ సోనియా, రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నుంచి మీడియాకు సమాచారం ఇచ్చారు. మే 18 వ తేదీన సాయంత్రం జరిగే సీఎల్పీలో అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
డీకే డిమాండ్లకు హైకమాండ్ ఓకే
సీఎం పీఠం కోసం సిద్ధరామయ్యతో పోటీపడిన డీకే శివకుమార్ ను బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పలు హామీలు ఇచ్చింది. మొదటి రెండున్నరేళ్లు కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, ఆ తర్వాత రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. అంతేకాదు.. కర్నాటక సీఎం పీఠంపై గంపెడాశలు పెట్టుకున్న డీకేను బుజ్జగించేందుకు హైకమాండ్ చాలా శ్రమించాల్సి వచ్చింది. అందుకే ఆయన డిమాండ్ల చిట్టాకు మొగ్గుచూపింది.
ఇందులో భాగంగానే డీకేకు డిప్యూటీ సీఎం పదవితో పాటు.. హోంశాఖ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఐదేళ్ల పాటు కర్నాటక పీసీసీ చీఫ్ గా కొనసాగే అవకాశం కూడా ఇచ్చింది. అంతేకాదు.. డీకే శివకుమార్ సూచించిన ఆరుగురికి కీలకమైన మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.
224 సీట్లకు గాను 135 సీట్లు గెలుచుకుంది బీజేపీ 66 సీట్లతో రెండో స్థానంలో నిలవగా, కింగ్‌మేకర్‌గా బరిలోకి దిగాలని భావించిన జేడీ(ఎస్) కేవలం 19 సీట్లతో సరిపెట్టుకుంది.