- అసెంబ్లీ వద్ద వేములవాడ కాంగ్రెస్ నేతల నిరసన
- ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ రిజైన్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు కనపడటం లేదని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సోమవారం అసెంబ్లీ ముందు నిరసన చేపట్టారు. ఏడాది నుంచి ఆయన నియోజకవర్గంలో ఉండటం లేదని, జర్మనీలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని నేతలు ఆరోపించారు. నియోజకవర్గానికి చెందిన కతలాపూర్, మేడిపల్లి, రుద్రంగి సహా ఏడు మండలాల కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. ‘‘సీఎం సార్.. వేర్ ఈజ్ వేముల వాడ ఎమ్మెల్యే?’’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘మా ఎమ్మెల్యే ఎక్కడ?’’ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోవటంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని నేతలు తెలిపారు. అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పీఎస్ కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులు అరెస్ట్ చేశారని లీడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి చెన్నమనేని రమేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో వేములవాడ కాంగ్రెస్ నేతలు కాయితీ నాగరాజు, తోట్ల అంజయ్య, గోపిడి ధనుంజయ్ రెడ్డి, పులి శిరీష హరిప్రసాద్, కళ్లడా గంగాధర్, చిలివేరీ రవి, మొయినుద్దీన్, తదితరులు ఉన్నారు.