డీలిమిటేషన్‎పై తగ్గేదేలే అంటున్న స్టాలిన్.. చెన్నై రావాలని దక్షిణాది రాష్ట్రాలకు లేఖ

డీలిమిటేషన్‎పై తగ్గేదేలే అంటున్న స్టాలిన్.. చెన్నై రావాలని దక్షిణాది రాష్ట్రాలకు లేఖ

చెన్నై: డీలిమిటేషన్‎కు వ్యతిరేకంగా కేంద్రంపై పోరును తమిళనాడు సీఎం స్టాలిన్ మరింత దూకుడు పెంచారు. డీలిమిటేషన్‎ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన స్టాలిన్.. తాజాగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న డీలిమిటేషన్‎కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్ర మాఝి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మొత్తం ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. అలాగే.. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‎కు కూడా స్టాలిన్ ఉత్తరం రాశారు. 

డీలిమిటేషన్‎‎కు వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు ముందుకు రావాలని ఆయా పార్టీలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తమిళనాడు రాజధాని చెన్నైలో 2025, మార్చి 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి రావాలని కోరారు. జేఏసీ సమావేశానికి పార్టీల తరపున సీనియర్‌ నేతలను పంపాలన్నారు.  

ALSO READ : ఫస్ట్ టైం..ప్రధాని మోదీకి మహిళా సెక్యూరిటీ గార్డులు

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అఖిలపక్షం తీర్మానం చేసి.. దక్షిణాది రాష్ట్రాల ఉనికిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ‘‘డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై స్పష్టమైన దాడి. పార్లమెంటులో మన హక్కును కాలరాయడం ద్వారా జనాభా నియంత్రణను సక్సెస్ ఫుల్‎గా చేసిన రాష్ట్రాలను శిక్షించడమే. ఈ ప్రజాస్వామ్య అన్యాయాన్ని మేము అనుమతించం’’ అని ట్వీట్ చేశారు.