![బీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలన్న సీఎం](https://static.v6velugu.com/uploads/2022/10/CM-wants-construction-work-of-BRS-Bhavan-to-be-completed-soon_KEHekwaoh4.jpg)
- ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం
- ఢిల్లీలో భవన నిర్మాణ పనుల పరిశీలన
- పలు మార్పులు చేర్పులు చేయాలని సూచన
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రెండో రోజు బుధవారం వసంత్ విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లతో పాటు వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్తేజను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు అంతస్తుల్లో కడ్తున్న ఈ భవన పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన.. పలు మార్పులు చేర్పులు సూచించారు. టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మార్చినందున అందుకు తగ్గట్టుగా భవన నిర్మాణం ఉండాలని అన్నారు.
సమావేశ మందిరాలు, తన చాంబర్ సహా మిగతా ఆఫీసులు ఏ విధంగా ఉండాలో సూచించారు. త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, దామోదరరావు, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేసీఆర్.. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం.