చౌటుప్పల్, వెలుగు: టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి వెళ్లాడని చేస్తున్న ఆరోపణలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి కొట్టిపారేశారు. రాజగోపాల్ రెడ్డికి పైసలే కావాలంటే టీఆర్ఎస్ లోనే చేరేవారు కదా అని ప్రశ్నించారు. గురువారం చౌటుప్పల్లోని పలు వార్డుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఇంటింటి ప్రచారం చేశారు. ఆమె మాట్లాడుతూ పైసల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినట్లయితే, కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే టీఆర్ఎస్లోకి వెళ్లేవాడన్నారు.
మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి మూడున్నరేండ్లుగా అన్ని వేదికల్లో, అసెంబ్లీలో మాట్లాడినా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. సీఎం అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకుండా అవమానించారని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే మునుగోడులో అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారని వివరించారు. లింగోజిగూడెం మాజీ సర్పంచ్ దీపిక, కౌన్సిలర్లు శ్రీధర్ బాబు, విజయ, అనిత, వరమ్మ, పద్మ పాల్గొన్నారు.