మహా కుంభమేళా: సీఎంతో సహా మంత్రులందరూ పుణ్య స్నానాలు

మహా కుంభమేళా: సీఎంతో సహా మంత్రులందరూ పుణ్య స్నానాలు

లక్నో: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయాగ్ రాజ్‎లో జరుగుతోన్న ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. 144 ఏండ్ల తర్వాత వచ్చిన ఈ అరుదైన ఫుష్కరాల్లో స్నానమాచరించేందుకు సాధువులు, మునులు, బాబాలు, సాధ్వీలు, భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. త్రివేణి సంగమంలో ఫుణ్యస్నానాలు చేసి పాప విముక్తులు అయ్యేందుకు భక్తులు కుంభమేళాకు పొటెత్తున్నారు. ఈ క్రమంలోనే 2025, జనవరి 22న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.

 సీఎం యోగితో పాటు డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఆయన సహచర కేబినెట్ మంత్రులు ప్రయాగ్ రాజ్‎లో పుణ్యస్నానమాచరించారు. సీఎం యోగి, ఆయన సహచర మంత్రులు కుంభమేళాలో స్నానాలు చేయడం ఇదే తొలిసారు. 2019లో జరిగిన కుంభమేళాలో కూడా యోగి, ఆయన కేబినెట్ మంత్రులు, అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి, ఇతర సాధువులతో కలిసి పవిత్ర స్నానమాచరించారు. 

అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌లో ఉత్తరప్రదేశ్ కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రి మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) మోడల్‌లో హత్రాస్, బాగ్‌పట్, కాస్‌గంజ్‌లలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే.. రాష్ట్రంలోని యువతకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది.  ప్రయాగ్‌రాజ్, వారణాసి, ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్‌లకు మునిసిపల్ బాండ్లను జారీ చేయాలనే నిర్ణయానికి కూడా ఈ ప్రత్యేక సమావేశంలో కేబినెట్ పచ్చజెండా ఊపింది. 

ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన వేడుకగా రికార్డ్ సృష్టించిన మహా కుంభమేళా.. 2025, జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం ఒడ్డున ప్రారంభమైన విషయం తెలిసిందే. మహా కుంభ్ ప్రారంభమైనప్పటి నుంచి జనవరి 22 వరకు దాదాపు 10 కోట్ల మంది ప్రజలు కుంభమేళాలో స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. 

మహాకుంభ సమయంలో సంగంలోని పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి, ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వసిస్తూ పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరగనుండగా.. ఈ సారి కుంభమేళా మాత్రం మరింత స్పెషల్. ఇది 144 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చే అరుదైన కుంభమేళా అని జ్యోతిష్యులు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు ఈ మహా కుంభమేళాకు తరలివెళ్తున్నారు. 2025, ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా జరగనుంది.