కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేయగలరా..? CM యోగి ఛాలెంజ్

కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేయగలరా..? CM యోగి ఛాలెంజ్

న్యూఢిల్లీ: ఆప్ పాలనలో కలుషితమైన యమునా నదిలో కేజ్రీవాల్, ఆప్ మంత్రులు స్నానం చేయగలరా అని యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ సూటిగా ప్రశ్నించారు. వాళ్లు ఈ సాహసం చేస్తారని అనుకోవడం లేదని.. స్వచ్ఛమైన యుమునా నదిని నిర్లక్ష్యం చేసిన వారిని ఢిల్లీ ప్రజలు క్షమించరని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం (జనవరి 23) కిరారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని.. ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‎పై విరుచుకుపడ్డారు.

 ఆప్ పాలనలో ఢిల్లీ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని విమర్శించారు. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని, తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందని.. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తూర్పారాబట్టారు. కేజ్రీవాల్, ఆప్ నాయకులు ప్రజలకు పని చేయడం కంటే ఎక్కువ సోషల్ మీడియాలోనే పబ్బం గడుపుతున్నారని.. అభివృద్ధిని విసర్మించి ట్వీట్లతో కాలం వెల్లదీస్తున్నారని ఫైర్ అయ్యారు. 

ALSO READ | సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పా: ఆటో డ్రైవర్ రాణా

 సోషల్ మీడియా మీద చూపించిన ఆసక్తి.. అభివృద్ధిపై కనబరిస్తే ఇప్పటికే ఢిల్లీ మరింత డెవలప్ అయ్యేదని సెటైర్ వేశారు. 2020లో దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు జరిగాయని.. ఈ అల్లర్ల వెనక ఆప్ కౌన్సిలర్ ప్రమేయం ఉన్నట్లు బయటపడిందని.. ప్రశాంతంగా ఉన్నా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీనే అల్లర్లకు కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడటంలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 

తన గురువు అన్నా హజారేకు ద్రోహం చేసిన కేజ్రీవాల్.. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని.. కానీ ఇకపై ఢిల్లీ ప్రజలు ఆప్ మోసపూరిత హామీలను నమ్మరని అన్నారు. ప్రతి రంగంలోనూ ఆప్ ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో అభివృద్ధి, శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు సీఎం యోగి ఆదిత్య నాథ్ విజ్ఞప్తి చేశారు.