మృత్యు కుంభ్ కాదు.. మృత్యుంజయ కుంభ్.. సీఎం మమతా బెనర్జీకి యోగి ఆదిత్యానాథ్ కౌంటర్

మృత్యు కుంభ్ కాదు.. మృత్యుంజయ కుంభ్.. సీఎం మమతా బెనర్జీకి యోగి ఆదిత్యానాథ్ కౌంటర్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయోగ్ రాజ్‎లో అట్టహాసంగా జరిగిన మహా కుంభమేళాను వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మృత్యు కుంభ్‎గా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మమతా బెనర్జీ వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియా టూడే నిర్వహిస్తోన్న కాంక్లేవ్‎లో శనివారం (మార్చి 8) సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంభమేళా తొక్కిసలాట ఘటన, మహా కుంభ్‎పై ప్రతిపక్షాలు చేసిన విమర్శల గురించి సీఎం యోగిని  ప్రశ్నించారు జర్నలిస్టులు. 

యోగి మాట్లాడుతూ.. మహా కుంభ్‌కు భారీగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమాన్ని మృత్యు కుంభ్ అని పిలిచిన వారికి తగిన సమాధానం ఇచ్చారని అన్నారు. మహా కుంభ్‌ను వారు మృత్యు కుంభ్ అంటే.. భక్తులు దానిని మృత్యుంజయ మహా కుంభ్ అని నిరూపించి ప్రతిపక్షాల నోర్లు మూయించారన్నారు. అలాగే.. కుంభమేళా ఏర్పాట్లలో వివక్ష చూపించారని.. వీఐపీల మీద దృష్టి పెట్టి సామాన్య ప్రజలకు సరైన ఏర్పాట్లు చేయలేదన్న ఆరోపణలపైన యోగి స్పందించారు. 

ALSO READ | ప్రపంచంలో నాకంటే ధనవంతులు లేరు: మోదీ

ప్రతి ఒక్కరూ ఒకే సంగమంలో స్నానం చేశారు. ధనిక, పేద, కులాలు, ప్రాంతాలు, భాషల మధ్య తేడాలు అన్నీ తుడిచిపెట్టబడ్డాయి. ఇది భారతదేశ ప్రజల ఐక్యతకు నిదర్శమని అన్నారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకర సంఘటన అని విచారం వ్యక్తం చేశారు. మౌని అమావాస్య స్నానాల సందర్భంగా జనవరి 28, 29 తేదీల మధ్య రాత్రి 1:15 నుండి 1:30 గంటల మధ్య తొక్కిసలాట జరిగిందని తెలిపారు.

 ఈ తొక్కి సలాటలో తీవ్రంగా గాయపడిన 65 మందిని ఆసుపత్రికి తరలించామని, దురదృష్టవశాత్తు అందులో 30 మంది మరణించారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలు  సహయ సహకారాలు అందించామని తెలిపారు. కాగా, 2025, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు దాదాపు 66 కోట్ల మందికి పైగా భక్తులు హాజరై పుణ్య స్నానాలు ఆచరించారు.