
ఆగస్టు 15లోపు గ్రామాల్లో 4 లక్షల ఉద్యోగాలు లంచం అడిగితే నాకే కాల్ చేయండి: వైఎస్ జగన్
అమరావతి, వెలుగు: ‘అవినీతి లేని పాలన అందిస్తా, ఆరు నెలల టైమ్ ఇవ్వండి’ అని ప్రజలకు ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. “9 ఏళ్లపాటు ప్రజల్లో ఉన్నా. 3,648 కి.మీ. పాదయాత్రతో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశా. వాళ్ల బాధలు విన్నా. సీఎంగా చెబుతున్నా పేదలందరికీ నేనున్నా. తారతమ్యాలు, వివక్షలు, అవినీతి లేని పాలన అందిస్తా. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తా. కేవలం రెండు పేజీల్లో మేనిఫెస్టోను ప్రకటించాం. అదే మా ప్రభుత్వానికి బైబిల్, ఖురాన్, భగవద్గీత. మేనిఫెస్టో అమలే ఊపిరిగా ఈ ఐదేళ్లు పనిచేస్తా” అని అన్నారు. అంతకు ముందు అశేష జనవాహిని, పార్టీ శ్రేణుల సమక్షంలో నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా జగన్ తో గవర్నర్నరసింహన్ ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ ఇతర ప్రముఖులు జగన్‌ను సత్కరించారు. నవరత్నాల్లో ప్రకటించిన వృద్ధాప్య పింఛన్ల పెంపు ఫైలుపై జగన్ తొలి సంతకం చేశారు. జూన్ నుంచి వృద్ధాప్య పింఛన్లను రూ.2,250కు పెంచనున్నట్లు ప్రకటించారు. ఏటా రూ.250 చొప్పున పెంచి రూ. 3 వేలు చేస్తామన్నారు.
రూ.5 వేల జీతంతో గ్రామ వలంటీర్లు
నవరత్నాలతో సంక్షేమ పథకాలను ప్రతి పేదకు డోర్‌డెలివరీ చేస్తామని జగన్అన్నారు. అన్ని గ్రామాల్లో చదువుకున్న, సేవ చేయాలనే తపన ఉన్న యువతను వలంటీర్లుగా నియమించి నెలకు రూ.5 వేల జీతం ఇస్తామన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆగస్టు 15 లోపు 4 లక్షల గ్రామ వలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పథకాల కోసం ఎవరైనా లంచం అడిగినా, వివక్ష చూపినా నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసేలా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని వెల్లడించారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల ఉద్యోగాలను ఆక్టోబర్ 2 లోపు భర్తీ చేస్తామని తెలిపారు.
రివర్స్ టెండరింగ్
టీడీపీ హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతిని వెలికి తీసి రివర్స్‌టెండరింగ్ చేపడతామని జగన్ ప్రకటించారు. “రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి టీడీపీ హయాంలో ఎంత ప్రజాధనం కొల్లగొట్టారో ప్రజలకు చూపించి తర్వాత కొత్త కాంట్రాక్టులు ఇస్తాం. దీని కోసం హైకోర్టు జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేస్తాం. కమిటీ సూచనల మేరకు మార్పులు చేసి కాంట్రాక్టులకు టెండర్లు పిలుస్తాం. అవినీతి జరగకుండా చూస్తాం. ఏపీలో మన కర్మ కొద్దీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను అందరూ కలిసి చూస్తున్నాం. వాళ్లకు సీఎంగా చంద్రబాబు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలిన వాళ్లను ఎప్పుడూ దించాలనే వాళ్ల రాతలు ఉంటాయి. పారదర్శకంగా జరిగిన కాంట్రాక్టులను ఎల్లో మీడియా
వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తాం. హైకోర్టుకు వెళ్లి వీళ్లని శిక్షించండి అని గట్టిగా అడుగుతాం” అని అన్నారు.
రాష్ట్రపతి, మోడీ,రాహుల్ శుభాకాంక్షలు
జగన్‌కు రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు.