సింగరేణి టార్గెట్..రోజుకు 2.40 లక్షల టన్నుల బొగ్గు

సింగరేణి టార్గెట్..రోజుకు 2.40 లక్షల టన్నుల బొగ్గు
  • సింగరేణి భవన్​లో జీఎంలతో 
  • రివ్యూ మీటింగ్ లో సీఎండీ బలరాం

హైదరాబాద్​, వెలుగు:సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల్లో  రోజుకు కనీసం 2.40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, అంతేస్థాయిలో రవాణాను జరపాలని సీఎండీ ఎన్.బలరాం అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం హైదరాబాద్​ సింగరేణి భవన్​లో అన్ని ఏరియాల జీఎంలతో బొగ్గు ఉత్పత్తిపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రోజుకు కనీసం16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని ఆదేశించారు. 

వానలు పూర్తిగా తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో ప్రతి ఏరియాలో వెనకబడి ఉన్న ఉత్పత్తితోపాటు ప్రతి నెలకు నిర్దేశించిన ఉత్పత్తి టార్గెట్​సాధించేందుకు ప్రత్యేక ప్లాన్​తో ముందుకెళ్లాలని సూచించారు. రోజువారీ లక్ష్యాలతో బొగ్గు ఉత్పత్తి చేయాలని, ఇందుకు మెషీన్లను పూర్తిస్థాయిలో వినియోగించాలని పేర్కొన్నారు. వచ్చే ఐదునెలల్లో ఆబ్సెంట్​కావద్దని, పూర్తిస్థాయిలో మానవ వనరులు, మెషీన్ల వాడకం జరగాలని స్పష్టంచేశారు.

ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ కు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు సాధించామని, ప్రస్తుతం 130 ఎకరాల అటవీ భూమిలోని చెట్ల లెక్కింపు అటవీ శాఖ ప్రారంభించారని పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి నైనీ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. కోల్ బంకర్, పవర్ సబ్ స్టేషన్, జనరేటర్ వంటివి నెలకొల్పడానికి, బొగ్గు రవాణాకు ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. 

సింగరేణిలో ఈ ఏడాది ప్రారంభించాల్సిన  కొత్తగూడెం వీకేఓపెన్ కాస్ట్ గని, ఇల్లందు రొంపేడు ఓపెన్ కాస్ట్ గని, రామగుండం కోల్ మైన్, గోలేటి ఓపెన్ కాస్ట్ గనుల ఏర్పాట్లపై అధికారులతో చర్చించి.. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఈ సమావేశంలో డైరెక్టర్  డి.సత్యనారాయణరావు,  డైరెక్టర్ (పీ పీ అండ్ పర్సనల్) జి. వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్)ఎస్ డీఎం.సుభాని, జీఎం (మార్కెటింగ్) రవి ప్రసాద్, జీఎం (సీపీపీ) మనోహర్, కొత్తగూడెం కార్పొరేట్ నుంచి వివిధ విభాగాల  జనరల్ మేనేజర్లు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.