సింగరేణిలో మెడికల్ దందాపై సీఎండీ ఫోకస్​

  • దళారుల కదలికలపై ఏసీబీ సాయంతో నిఘా
  • ఎవరైనా డబ్బులు అడిగితే కార్మికులు నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని బలరాం సూచన
  • మెడికల్​అన్​ఫిట్ స్కీమ్ ను సాకుగా చేసుకొని కోట్లలో అక్రమార్కుల దందా​
  • బోర్డు కమిటీలో మార్పుల దిశగా కార్యాచరణ

కోల్ బెల్ట్, వెలుగు : సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ ను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయల్లో దందా చేస్తున్న దళారులకు అడ్డుకట్ట వేయడంపై యాజమాన్యం దృష్టి పెట్టింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్.. మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ పై ప్రత్యేక దృష్టి  పెట్టారు. మెడికల్  బోర్డులో వైద్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేలా ఇప్పటికే అధికారులను ఆదేశించిన సీఎండీ.. అక్రమార్కుల భరతం పట్టేందుకు ఏసీబీ సహకారం కోరారు.

ఒక్కో ఉద్యోగి నుంచి రూ.15 లక్షలు వసూలు!

సింగరేణిలో 2018 ఏప్రిల్  నుంచి మెడికల్  బోర్డు ద్వారా అన్ ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 16 వేల మంది వారసులు మెడికల్ ఇన్ వ్యాలిడేషన్  ద్వారా ఉద్యోగంలో చేరారు. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య సమస్యలతో తాము పనిచేయలేమని, తమ ఉద్యోగాన్ని వారసునికి ఇవ్వాలని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. అలా అప్లై చేసకున్న వారిని వివిధ విభాగాల వైద్యులు పరీక్షించి ఉద్యోగం చేయలేరని నిర్ధారిస్తే అతడి వారసునికి సంస్థ యాజమాన్యం ఉద్యోగం ఇస్తుంది. మెడికల్  బోర్డు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వారసునికి ఉద్యోగం రాకుండా ఉండేందుకు తమను ఎక్కడ ఫిట్  చేస్తారోనని చాలా మంది కార్మికులు మెడికల్  బోర్డుకు వెళ్లే ముందు దళారులను నమ్మి రూ.లక్షల్లో ముట్టజెప్పుతున్నారు. ఒక్కో ఉద్యోగి కనీసం రూ.15 లక్షలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ వ్యవహారం సింగరేణిలో చాలా కాలంగా సాగుతోంది. కార్మికుల బలహీనతలను ఆసరాగా చేసుకొని దళారులు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఈ దందాలో  సంస్థలో పనిచేసే వారితో పాటు బయటి వాళ్లకూ ప్రమేయం ఉంది. అందుకు నిదర్శనంగా గతంలో విజిలెన్స్  విచారణలో ఇద్దరు వైద్యులు, ఒక ఆఫీసర్ తో పాటు సింగరేణి ఆసుపత్రుల్లో పనిచేసే మరికొందరు ఉన్నట్లు బయటపడింది. దీంతో ఉద్యోగులపై సంస్థాగతంగా చర్యలు తీసున్నారు. దళారుల్లో కొందరు కార్మిక సంఘాల లీడర్లు, ఆఫీసర్లు కూడా ఉన్నారు. బీఆర్ఎస్  హయాంలో అప్పటి సీఎం కేసీఆర్  సింగరేణిలో లంచం అనేదే లేకుండా చేస్తామని, లంచం తీసుకుంటే చెప్పులతో కొట్టాలని పిలుపు ఇచ్చినా..  ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కొందరు లీడర్లు రాజకీయ అండతో మెడికల్ దందాను అడ్డుపెట్టుకొని రూ.కోట్లు దండుకున్నారు. ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కీలక సంఘాన్ని కార్మికులు ఓడించడంలో ఈ అంశం కూడా కీలకమైంది.  కొత్తగూడెం హెడ్ ఆఫీసులో పరిధిలో ప్రతినెలకు ఒకసారి లేదా రెండుసార్లు మెడికల్  బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్  దందాలో భాగంగా లీడర్లు, దళారులు తమ పలుకుబడి ఉపయోగించి డబ్బులు ఇచ్చిన కార్మికులు అన్ ఫిట్ అయ్యేలా చూస్తున్నారు. ఇందు కోసం కొందరు ఆఫీసర్లకు కూడా కొంత ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏసీబీ సహకారం.. బోర్డులో మార్పులతో చెక్​పెట్టే వ్యూహం

సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ దందాకు అడ్డుకట్ట వేయడంపై సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్  దృష్టి పెట్టారు. మెడికల్  అన్ ఫిట్  చేస్తామని ఎవరైనా దళారులు డబ్బులు అడిగితే కార్మికులు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఇటీవలే ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. మెడికల్  బోర్డులో వైద్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆఫీసర్లను సీఎండీ ఆదేశించారు. తాజాగా సింగరేణిలో మెడికల్ ఇన్ వాలిడేషన్  దళారుల దందాను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సహకారాన్ని సీఎండీ  కోరారు. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేశ్  టీం సీఎండీతో కలిసి, మెడికల్ బోర్డులో జరిగే ప్రక్రియ వివరాలు సేకరించింది. మరోవైపు మెడికల్ బోర్డులో అవసరమైతే మార్పులు చేసే అవకాశంపైనా కసరత్తు జరుగుతోంది. వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ఎవరికీ సంబంధం లేని డాక్టర్లను మెడికల్ బోర్డులో ఉండేలా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది.