- 2,263 మంది ఉద్యోగులకు పదోన్నతులు
హైదరాబాద్, వెలుగు: సదరన్ డిస్కంలో గత ఏడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు మోక్షం లభించినట్లయింది. డిస్కం చరిత్రలో మొదటిసారిగా ఒకే రోజు 2,263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ ఆ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. ఇంజినీరింగ్ సర్వీస్‌లో 101, అకౌంట్స్ సర్వీస్‌లో 47, ఓఅండ్‌ఎంలో 2,099, పీ అండ్ జీ సర్వీస్‌లో 16 మంది అధికారులు, సిబ్బందికి ప్రమోషన్లు లభించాయి. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో పలువురు అధికారులు పెండింగ్ ప్రమోషన్లను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
డిప్యూటీ సీఎం స్పందించి ప్రమోషన్లు ఇవ్వాలని సీఎండీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎండీ ప్రమోషన్లకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్ఈ నుంచి సీఈకి ఇద్దరు, డీఈ నుంచి ఎస్ఈకి 8మంది, ఏడీఈ నుంచి డీఈకి 30 మంది, ఏఈ నుంచి ఏడీఈకి 58 మంది, జేఎల్ఎం నుంచి ఏఎల్ఎంకు 1,650 మంది, అకౌంట్స్‌లో జీఎం నుంచి సీజీఎంలుగా ఇద్దరు, ఎస్‌ఏవో నుంచి జీఎంగా ఇద్దరు, పీ అండ్ జీ జీఎం నుంచి జాయింట్ సెక్రటరీగా ఒక్కరికి ప్రమోషన్లు దక్కాయి. 2,263 మందికి ప్రమోషన్లతో ఏర్పడే ఖాళీల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని సీఎండీ తెలిపారు. తాజా నిర్ణయంతో ఉద్యోగులు సీఎం, డిప్యూటీ సీఎంల ఫొటోలకు పాలాభిషేకం చేశారు.