కరీంనగర్​ జిల్లాలో 13 మిల్లులు.. రూ.118 కోట్ల బకాయిలు

కరీంనగర్​ జిల్లాలో 13  మిల్లులు..  రూ.118 కోట్ల బకాయిలు
  •  కరీంనగర్​ జిల్లాలో మూడేళ్లుగా భారీగా ఎగవేతలు
  •  చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు
  •  పెద్దమొత్తంలో బకాయిపడిన నలుగురు మిల్లర్లపై ఇప్పటికే క్రిమినల్ కేసులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో  సీఎంఆర్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 13 మిల్లుల నిర్వాహకులు రూ.118 కోట్ల సీఎంఆర్ ను ఎగవేశారు. మొత్తం బకాయిలు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో  2021–22 వానకాలం, 2022–23 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో అప్పగించిన వడ్లకు సంబంధించినవే ఉన్నాయి. మూడు, నాలుగేళ్లవుతున్నా రైస్ మిల్లర్లు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదు. తమకు అప్పగించిన కోట్లాది రూపాయల విలువైన వడ్లను మరాడించి బియ్యంగా మార్చి మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అమ్ముకోవడం వల్లే ప్రభుత్వానికి అప్పగించలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే  మొండి బకాయిదారులపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసింది. దీంతోపాటు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్  ప్రయోగించేందుకు సిద్ధమైనా మిల్లర్ల నుంచి ఏడాదిగా స్పందన కనిపించడం లేదు. 

రెండు మిల్లుల బకాయిలే రూ.103 కోట్లు 

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల అండ, అధికారుల పట్టింపులేనితనం ఫలితంగా జిల్లాలో మిల్లర్ల అక్రమాలకు అంతులేకుండా పోయింది. కొందరు పైసా పెట్టుబడి లేకుండా కోట్లకు పడగలెత్తారు. మరాడించి ఇవ్వమని సర్కార్ కేటాయించిన వడ్లను తమిళనాడు, ఏపీలాంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఆ డబ్బును ఇతర వ్యాపారాల్లోకి మళ్లించి లాభాలు గడిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి సీతారామ అగ్రో ఇండస్ట్రీస్ 2022-23 యాసంగికి సంబంధించి రూ.41.18 కోట్లు,   2023–24 వానకాలానికి సంబంధించి  రూ.13.20 కోట్లు కలిపి రూ.54.42 కోట్లు బకాయిపడింది.

 జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన  మహాశక్తి అగ్రో ఇండస్ట్రీస్ 2022–23 యాసంగికి సంబంధించి రూ.30.22 కోట్లు,  2023–24 వానకాలానికి సంబంధించి  రూ.19.08 కోట్లు కలిపి 49.30 కోట్లు బకాయిపడింది. ఈ రెండు మిల్లుల బకాయిలే 103.68 కోట్లు ఉండడం, ఇవి రెండు ఒకే కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం. వీరిపై నిరుడు జూన్‌‌‌‌‌‌‌‌లోనే క్రిమినల్ కేసులు నమోదు చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎగవేత సొమ్ము రికవరీ కాలేదు. 

మరికొన్ని మిల్లుల్లో ఇదే తంతు.. 

సీతారామ, మహాశక్తి అగ్రో ఇండస్ట్రీస్ తోపాటు మరికొన్ని మిల్లుల సీఎంఆర్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.  శంకరపట్నం మండలం మొలంగూరుకు చెందిన  పవనసుత ట్రేడర్స్(లలిత ఇండస్ట్రీస్ మోడర్న్ రైస్ మిల్లు) 2021–22 వానకాలానికి సంబంధించి రూ.5,48,30,630 బకాయి ఉండడం, నోటీసులకు స్పందించకపోవడంతో సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పరమేశ్వర ఇండస్ట్రీస్ 2021–22 వానకాలానికి సంబంధించి రూ.9‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0.24 లక్షలు, 2022–23 యాసంగికి సంబంధించి  రూ.84.14  లక్షలు కలిపి రూ.1.74 కోట్ల బకాయిపడడంతో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 

2021-22 వానకాలానికి సంబంధించి ఇదే మండలం బోర్నపల్లిలోని సాయి ట్రేడర్స్(జగన్మాత)  రూ.2,19 కోట్లు,  శ్రీమహాలక్ష్మీ అగ్రో రూ.59.82 లక్షలు, శ్రీలక్ష్మీవెంకటరమణ ఎంటర్ ప్రైజెస్(భద్రకాళి ఇండస్ట్రీస్) రూ.4.36 లక్షలు, పెద్దపాపయ్యపల్లికి చెందిన వంశీ ఇండస్ట్రీస్  రూ.1.89 కోట్లు,  లక్ష్మీదేవిపల్లికి చెందిన శ్రీశ్రీ వీరభద్ర మోడ్రన్ రైస్ మిల్లు  రూ.1.31 కోట్లు,  జమ్మికుంట మండలం బుజునూర్ కు చెందిన శ్రీవెంకటేశ్వర రైస్ మిల్లు రూ.88.97 లక్షలు, చొప్పదండి మండలం అర్నకొండకు చెందిన సౌజన్య అగ్రో ఇండస్ట్రీస్ రూ.12.97 లక్షలు, హుజూరాబాద్ కు చెందిన నాగశ్వేత ట్రేడర్స్(మధు ఎంఆర్ఎం) రూ.52.70 లక్షలు, ఇల్లంతకుంటకు చెందిన శ్రీ హనుమాన్ సీతారామానుజ ఎంఆర్ఎం రూ.36.69 లక్షలు బకాయి ఉన్నాయి. 

మళ్లీ నోటీసులు ఇస్తాం.. 

సీఎంఆర్ అప్పగించకుండ కోట్లాది రూపాయలు బకాయిపడిన నాలుగు మిల్లులపై గతేడాది క్రిమినల్ కేసులు నమోదు చేయించాం. గతంతో పోలిస్తే చాలామంది మిల్లర్లు సీఎంఆర్ కు సంబంధించిన డబ్బులు చెల్లించడంతో వారిని డీఫాల్టర్ల లిస్టులో నుంచి తొలగించాం. అయినా ఇంకా కొందరు 2021–-22, 2022–- 23 నాటి బకాయిలు ఉన్నారు. వారికి మరోసారి నోటీసులు ఇచ్చి రికవరీ చేసేందుకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. 

రజినీకాంత్, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేర్, కరీంనగర్