సూర్యాపేట జిల్లాలో సీఎమ్మార్ బకాయిలు రూ.623 కోట్లు

సూర్యాపేట జిల్లాలో సీఎమ్మార్ బకాయిలు రూ.623 కోట్లు
  • 2022–23 సీజన్ బకాయిలు ఇవ్వని మిల్లులకు నోటీసులు
  • 25 శాతం పెనాల్టీతో ఇవ్వాలని మిల్లర్లకు ఆదేశం  
  • రూ.515 కోట్లు పక్కదారి పట్టించిన మిల్లర్ల వివరాలు సేకరిస్తున్న అధికారులు

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో మొత్తం రూ.623 కోట్ల విలువైన 1.71 లక్షల మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ పెండింగ్ లో ఉంది. వీటిలో 8 మిల్లుల్లో రూ.515 కోట్ల విలువైన 1.40 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు మాయం చేశారు. దీంతో సీఎమ్మార్ ఇవ్వని మిల్లులపై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)గా మార్చడం కోసం మిల్లులకు పంపిన ధాన్యాన్ని మిల్లర్లు ఇవ్వకుండా పక్కదారి పట్టించారు. 

తమ వద్దే బియ్యం ఉన్నట్టు మిల్లర్లు లెక్కలు చూపిస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో వడ్లు మిల్లర్ల వద్దే ఉన్నాయని భావించిన సర్కారు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి విక్రయించాలని నిర్ణయించింది. మిల్లుల్లో యాసంగి ధాన్యం ఎంత నిల్వ ఉందో తేల్చేందుకు అధికారులు తనిఖీలు చేపట్టగా మిల్లర్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మిల్లుల్లో గత యాసంగి ధాన్యాన్ని అమ్ముకున్నారని విచారణలో తేల్చింది. 

మిల్లులకు నోటీసులు..

ఏండ్లు గడుస్తున్నా సీఎమ్మార్ లక్ష్యం పూర్తి కాకపోవడంతో అధికారులు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. మిల్లుల్లో ధాన్యం లేదని గుర్తించి కేసులు నమోదు చేయించారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల జాబితాను ఇటీవల సివిల్ సప్లయ్ సంస్థ జిల్లాలకు పంపింది. ఈ జాబితాలో సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో ఉండగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 31 మిల్లుల్లో ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. నల్గొండ జిల్లాలో 12 మిల్లులు, సూర్యాపేట జిల్లాలో 19 మిల్లుల్లో ధాన్యం లేదని అధికారులు గుర్తించారు. 

అయితే సూర్యాపేట జిల్లాలోని 19 మిల్లుల్లో 8 మిల్లుల యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. మరో ఆరు మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మొత్తం 13 మిల్లులకు 25 శాతం పెనాల్టీతో చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. 2022– 23 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం రికవరీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

జిల్లాలో రూ.623 కోట్ల సీఎమ్మార్ బకాయిలు..

సూర్యాపేట జిల్లాలో మొత్తం రూ.623 కోట్ల విలువైన 1.71 లక్షల మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ పెండింగ్ లో ఉంది. వీటిలో 8 మిల్లుల్లో  రూ.515 కోట్ల విలువైన1.40 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు మాయం చేశారు. గత సర్కార్ అండతో ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు.. బినామీ పేర్లతో కొత్తగా మిల్లులను ఏర్పాటు చేసుకొని సీఎమ్మార్ ధాన్యాన్ని కేటాయించేలా చేసుకున్నారు. మరోవైపు ఎఫ్​సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేసినా ధాన్యం లేకున్నా.. ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏకంగా పీఎంవోలో ఓ వ్యక్తి నేరుగా ఫిర్యాదు చేయడంతో  సీబీఐని విచారణకు ఆదేశించినట్లు ఆ సంస్థలోని ఒక అధికారి తెలిపారు.