హనుమకొండ జిల్లాలో సీఎంఆర్ వడ్లు మాయం

హనుమకొండ జిల్లాలో సీఎంఆర్ వడ్లు మాయం
  • రైస్ మిల్ పై సివిల్​ సప్లై, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు
  • రూ. 7.50 కోట్ల విలువైన రైస్ ను యజమాని అమ్ముకున్నట్టు గుర్తింపు

ఎల్కతుర్తి, వెలుగు :  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట బాలాజీ ఇండస్ట్రీస్ లో  సివిల్​సప్లై, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు చేశారు. సీఎంఆర్‌‌(కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌) ధాన్యం పెద్ద మొత్తంలో మాయమైనట్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యం పట్టించి ఇవ్వాల్సిన మిల్లర్ సుమారు రూ. 7.50 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేల్చారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సివిల్ ​సప్లై, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.

మిల్లులో నిల్వ ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని లెక్కించారు. బాలాజీ మిల్లుకు 2021‌‌‌‌--– 22, 2022– --23 సంవత్సరాలకు గాను 6,339 టన్నుల ధాన్యాన్ని  కేటాయించారు. 4, 310 టన్నుల బియ్యాన్ని మిల్లు యజమాని తిరిగి ఇవ్వాల్సి ఉంది.  కేవలం 1, 889 టన్నులు మాత్రమే ఇచ్చారు.  మిగతా 3, 521 టన్నుల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉంది. కానీ 205 టన్నులు మాత్రమే నిల్వ ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. మిగతా ధాన్యం మిల్లు యజమాని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నట్లు తేలింది.

ఆ ధాన్యం విలువ సుమారు రూ.7.50 కోట్లు ఉంటుందని  ఎన్ ఫోర్స్ మెంట్ ప్రత్యేకాధికారి ఎల్. లక్ష్మారెడ్డి తెలిపారు. మిల్లు యజమాని రవీందర్ రెడ్డిపై  క్రిమినల్ కేసులకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ మిల్లుల యజమానులు స్పందించకపోవడంతో దాడులు చేస్తున్నట్లు వివరించారు. డీటీ సీఎస్ నాగేంద్ర ప్రసాద్, ఫుడ్ ఇన్ స్పెక్టర్ సదానందం, టెక్నికల్ అసిస్టెంట్ కనకాచారి, సిబ్బంది ఉన్నారు.