- పూడూరు వద్ద 14 వేల మెట్రిక్ టన్నులు నిల్వ
- సివిల్ సప్లై అధికారల తనిఖీల్లో వెలుగులోకి
- కోర్టు ఆదేశాలతో సీజ్ చేసేందు వెళ్తే దొరికిన వడ్లు
- పక్కదారి పట్టించేందుకేనని ఆరోపణలు
- మిల్లర్లతో పాటు అధికారుల పాత్రపైనా అనుమానాలు
గద్వాల, వెలుగు: గద్వాల, వనపర్తి జిల్లాకు చెందిన మిల్లర్లు సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టిస్తున్నారు. పర్మిషన్ లేని, సీజ్ చేసిన గోదాముల్లో నిల్వ ఉంచుతూ పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గద్వాల మండలం పూడూరు , ఎర్రవల్లి గ్రామాల వద్ద ఉన్న గోదాముల్లో 15 రోజుల కింద 14 వేల మెట్రిక్ టన్నుల వడ్లు దొరికాయి. పర్మిషన్ లేని ఈ గోడౌన్లను సీజ్ చేయాలనే కోర్టు ఆదేశాలతో అక్కడికి వెళ్లిన అధికారులకు వడ్లు కనిపించాయి. ఆరా తీయగా నిరుడు యాసంగి సీజన్‌కు చెందిన సీఎంఆర్ వడ్లని తేలాయి. దీంతో కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లి ఖాళీ చేసే పనిలో పడ్డారు.
జరిగింది ఇదీ..
గద్వాల మండలం పూడూరు, ఎర్రవల్లి గ్రామాల వద్ద కొందరు లీడర్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా గోదాములు నిర్మించారు. ఇందులో పూడూరు గ్రామానికి వెళ్లే రోడ్డును ఆక్రమించడంతో గ్రామస్తులు ఏడాది కింద కోర్టుకు వెళ్లారు. విచారించిన కోర్టు ఆ గోదాములను సీజ్ చేయాలని ఆదేశించింది. కొద్ది రోజు తర్వాత ఓనర్లు రోడ్డు వదులుతామని, డీడీసీపీ అప్రూవల్, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటామని మళ్లీ కోర్టుకు వెళ్లారు. పరిశీలించిన కోర్టు వారికి కొంత టైమ్ ఇచ్చి అన్ని పర్మిషన్స్ సబ్మిట్ చేయాలని చెప్పింది. దీంతో కొంత మేర రోడ్డు వదలి పెట్టారు. ఫైర్ స్టేఫీ పరికరాలు తెచ్చినా.. బిగించకుండానే సంబంధిత ఆఫీసర్లను మేనేజ్ చేసి సర్టిఫికెట్ తీసుకున్నారు. డీడీసీపీ అప్రూవల్ మాత్రం తీసుకోలేదు. ఈలోగా కోర్టు ఇచ్చిన గడువు అయిపోవడంతో గ్రామస్తులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. స్పందించిన కోర్టు వెంటనే సీజ్ చేయాలని సివిల్ సప్లై అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అక్కడికి వెళ్లిన ఆఫీసర్లకు సీఎంఆర్ వడ్లు దర్శనం ఇచ్చాయి.
తనిఖీ రిపోర్ట్ ఎలా ఇచ్చారు..?
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎంఆర్ వడ్లు కేటాయించిన మిల్లులు, గోదాములను తనిఖీ చేసి కలెక్టర్‌కు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు ఇస్తున్నారు కూడా..!! అయితే పూడూరు గోదాముల్లోనే 14 వేల మెట్రిక్ టన్నులు (వనపర్తి జిల్లాకు సంబంధించిన 2.30 లక్షల బస్తాలు, గద్వాలకు చెందిన 1.20 లక్షల బస్తాలు) ఉంటే.. ఎక్కడ తనిఖీ చేసి రిపోర్ట్ ఇచ్చారో ప్రశ్నార్థకంగా మారింది.
వనపర్తి జిల్లావి ఇక్కడ ఎందుకు?
సీఎంఆర్ వడ్లను నిల్వ ఉంచే గోదాముల వివరాలను మిల్లర్లు సివిల్ సప్లై ఆఫీసర్ల నోటీసులో పెట్టాలి. ఏఏ గోదాముల్లో ఎన్ని క్వింటాళ్లు ఉంచుతున్నారో కూడా చెప్పాలి. పక్కజిల్లా వడ్లు నిల్వ ఉంచాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా వనపర్తి జిల్లాకు చెందిన మిల్లర్లు 2.30 లక్షల బస్తాలను ఎలాంటి పర్మిషన్ లేని పూడూరు గోదాముల్లో నిల్వ ఉంచారు.వీటిని పక్కరాష్ట్రాలకు తరలించి.. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పజెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అధికారులు మిల్లర్లకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
నోటీసులు ఇచ్చినం..
పర్మిషన్ లేని గోదాముల్లో సీఎంఆర్ వడ్లు పెట్టిన వారికి నోటీసులు ఇచ్చినం. అక్కడ ఉన్న వడ్లను జనవరి నాలుగో తేదీ వరకు ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నం. సీఎంఆర్ వడ్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నం. ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినం.
–రేవతి, డీఎస్వో గద్వాల