హైదరాబాద్: మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్ రూమ్‌లో విద్యార్థినుల నగ్న వీడియోలు చిత్రీకరించారని స్టూడెంట్స్ చేస్తోన్న ఆందోళనపై ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ స్పందించారు. గురువారం (జనవరి 2) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాత్ రూమ్‌లో సెల్ ఫోన్ పెట్టి తమ ప్రైవేట్ వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థినులు బుధవారం (జనవరి 1) మధ్యాహ్నం తమకు కంప్లైంట్ చేశారని ఆయన తెలిపారు. కుకింగ్ డిపార్ట్మెంట్లోని కొందరు అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
వార్డెన్ టర్మినేట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారని.. వారి కోరిక మేరకు హాస్టల్ వార్డెన్ ను విధుల నుండి తొలగించామన్నారు. ఈ విషయంలో అండగా ఉంటామని విద్యార్థునులకు హామీ ఇచ్చామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. హాస్టల్ సీసీ టీవీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చామని.. పోలీసుల విచారణకు పూర్తిగా సపోర్ట్ చేస్తామన్నారు.
ఈ ఘటన నుండి హాస్టల్ వార్డెన్ ప్రీతిని మేం తప్పించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఇప్పటికే మేం ఆమెను టర్మినేట్ చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఐదుగురు లేడి సీనియర్ స్టాఫ్‌తో కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. స్టూడెంట్స్ మా పిల్లలతో సమానమని.. వారి భద్రతే మాకు ముఖ్యమన్నారు. నిందితులు ఎవరైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకొంటామని స్పష్టం చేశారు.
హాస్టల్ బాత్ రూమ్‌లో మొబైల్ ఫోన్లు పెట్టి తమ నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ సీఎంఆర్ కాలేజీ విద్యార్థునులు బుధవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్‌కు మద్దతుగా విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగి.. కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. హాస్టల్ కుకింగ్ డిపార్ట్మెంట్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.