దేశం దాటిన మిల్లర్ల దందా..రూ. 515 కోట్ల విలువైన బియ్యం గాయబ్​

దేశం దాటిన మిల్లర్ల దందా..రూ. 515 కోట్ల విలువైన బియ్యం గాయబ్​
  • కాకినాడ పోర్ట్​ నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్​ రైస్​
  • బీఆర్ఎస్​ హయాంలో లీడర్లు, మిల్లర్ల బరితెగింపు
  • సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగుచూసిన బాగోతం
  • 8 మిల్లుల నుంచి రూ.515 కోట్ల రైస్​ ఇతర దేశాలకు 
  • ఒకే మిల్లు నుంచి రూ.100 కోట్ల విలువైన బియ్యం గాయబ్​
  • ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • మిల్లర్ల నిర్వాకంతో తొమ్మిదిన్నరేండ్లలో దాదాపు రూ.11 వేల కోట్ల ధాన్యం పెండింగ్
  • 58 వేల కోట్ల అప్పుల్లో సివిల్​ సప్లయ్స్​ శాఖ
  • ఇప్పటికే ఆర్​ఆర్ యాక్ట్​, క్రిమినల్​ కేసులతో రూ.1,281 కోట్లు రికవరీ
  • కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్​ విసురుతున్న అక్రమార్కులు

సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ హయాంలో లీడర్లతో కలిసి కొందరు మిల్లర్లు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా కస్టమ్ మిల్లింగ్​ రైస్(సీఎంఆర్) కోసం సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి, విదేశాలకు అమ్ముకున్న బాగోతం సూర్యాపేట జిల్లాలో  వెలుగు చూసింది. ఎనిమిది మిల్లులు రూ. 515 కోట్ల విలువైన 1.40 లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్ట్​ ద్వారా విదేశాలకు అమ్ముకోగా..

ఇందులో ఒకే మిల్లు నుంచి రూ.100 కోట్ల విలువైన బియ్యం తరలించడం కలకలం రేపుతున్నది. సివిల్​ సప్లయ్స్​ ఆఫీసర్ల ఫిర్యాదుతో అక్రమార్కులపై కేసులు నమోదుచేసిన పోలీసులు.. పలువురు మిల్లర్లు, వ్యాపారులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఎంక్వైరీలో రోజుకో బాగోతం బయటపడుతున్నది. 

కాకినాడ పోర్ట్​ ద్వారా..

సూర్యాపేట జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య గత ప్రభుత్వంలోని పెద్దల అండతో 2022 రబీ నుంచి 2023 వానాకాలం సీజన్​వరకు రూ. 100 కోట్ల విలువైన సీఎంఆర్ రైస్ ను కాకినాడ పోర్ట్ ద్వారా విదేశాలకు తరలించినట్లు తేలింది. 

సోమనర్సయ్యకు చెందిన తిరుమలగిరిలోని శ్రీసంతోష్ రైస్ ఇండస్ట్రీకి 2022 -–23 యాసంగి సీజన్​లో 27,998 టన్నుల ధాన్యం కేటాయించగా.. 27,458 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్ట్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో  ఒక్కరోజే 30 లారీలతో ఏకంగా రూ.2.55 కోట్ల విలువైన 750 టన్నుల సీఎంఆర్​ బియ్యాన్ని నిరుడు జూన్​లో తరలించినట్లు తేల్చారు. సీఎంఆర్​ను పక్కదారి పట్టించాడని గుర్తించిన నాటి సివిల్​ సప్లయ్స్​ అధికారులు శ్రీసంతోష్​ రైస్​ ఇండస్ట్రీకి కొత్తగా ధాన్యం ఇవ్వరాదని నిర్ణయించినప్పటికీ..

నాడు బీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడితో అదే మిల్లుకు 2023 -–24 ఖరీఫ్ సీజన్ లో 17,179 టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక.. అక్రమాలపై దాడులు నిర్వహించే నాటికి ఆ సీజన్​కు సంబంధించిన 7,542.67 టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని కూడా బయట అమ్ముకున్నట్లు సివిల్​ సప్లయ్స్​​ ఆఫీసర్లు గుర్తించారు. మొత్తంగా 35,001 టన్నుల సీఎంఆర్ పెండింగ్ ఉండడంతో సివిల్ సప్లయ్స్​ ఆఫీసర్లు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇమ్మడి సోమనర్సయ్యపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు.

విచారణలో భాగంగా రైస్​ను కాకినాడ పోర్ట్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్లు సోమనర్సయ్య ఒప్పుకోవడంతో ఆమేరకు ఆధారాలు సేకరించారు. ఇమ్మడి సోమ నర్సయ్య తో పాటు ఆయన ఫ్యామిలీకి చెందిన10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, రూ.100 కోట్ల విలువైన పేదల బియ్యాన్ని విదేశాలకు తరలించిన   సోమనర్సయ్య.. తనపై ఆర్​ఆర్​ యాక్ట్​ప్రయోగించకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. 

ఇటు ఆర్ఆర్ ​యాక్ట్​..అటు క్రిమినల్​కేసులు..

సివిల్​ సప్లయ్స్​ శాఖ ప్రతి సీజన్​లో బ్యాంకుల నుంచి వేల కోట్ల లోన్లు తీసుకొని రైతుల నుంచి వడ్లు సేకరిస్తుంది. ఇట్ల కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి, వారు మరాడించిన బియ్యాన్ని ఎఫ్‌‌‌‌సీఐకి లెవీ పెడ్తుంది. ఎఫ్​సీఐ నుంచే రేషన్​షాపుల ద్వారా పేదలకు ఉచిత బియ్యం అందుతాయి. కాగా, బీఆర్ఎస్​తొమ్మిదిన్నరేండ్ల పాలనలో పలు జిల్లాల్లో లీడర్లు, మిల్లర్లు ఏకమై వేల కోట్ల అక్రమాలకు తెరతీశారు. ఈక్రమంలోనే ఎలాంటి బ్యాంక్​గ్యారెంటీ లేకుండా, కనీసం మిల్లులు ఉన్నాయో లేదో వెరిఫై చేయకుండా వ్యాపారులకు, మిల్లర్లకు భారీ మొత్తంలో వడ్లు కేటాయించారు.

ఇలా అడ్డదారిలో పొందిన ధాన్యాన్ని  మిల్లింగ్​ చేశాక ఎఫ్​సీఐకి పెట్టకుండా బహిరంగ మార్కెట్​లో మిల్లర్లు అమ్ముకున్నారు. కొందరు కాకినాడ పోర్ట్​ ద్వారా బంగ్లాదేశ్​, శ్రీలంక, మలేసియా లాంటి దేశాలకు, గల్ఫ్​ కంట్రీస్​కు ఎగుమతి చేశారు. ప్రతి సీజన్​లో అక్రమాలు అలవాటుగా మారడంతో 2014 నుంచి తొమ్మిదిన్నరేండ్లలో దాదాపు  రూ.11వేల కోట్లకు పైగా విలువైన ధాన్యం పెండింగ్​ పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి సివిల్​ సప్లయ్స్  శాఖ రూ.58,630 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో తన శాఖ పరిస్థితి చూసిన మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి.. ఆ శాఖ ప్రక్షాళనకు పూనుకున్నారు.

ALSO READ : మిషన్ భగీరథ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

వరుస దాడులు, ఆర్​ఆర్​(రెవెన్యూ రికవరీ) యాక్ట్ తో మిల్లర్లను బెంబేలెత్తించారు. దీంతో వందలాది మిల్లర్లు బయట వడ్లు కొని మరీ సీఎంఆర్​పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి రాష్ట్రవ్యాప్తంగా 362 మంది రైస్ మిల్లర్లను డిఫాల్టర్లుగా తేల్చిన సివిల్  సప్లయ్స్​ ఆఫీసర్లు.. వారి నుంచి  రూ.3,200 కోట్లు రాబట్టాలని లెక్కతీశారు. జీవో నంబర్ 11లో సవరణలు చేసి అక్రమ మిల్లర్లు తమ ప్రాపర్టీని అమ్ముకోకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికి 402 కేసులు, 77 క్రిమినల్​ కేసులు, 351ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేసి నయానో భయానో రూ.1,281 కోట్లు రికవరీ చేశారు. ఈక్రమంలో కొందరు మిల్లర్లు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటూ ఆఫీసర్లకు సవాల్​ విసురుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

8 మిల్లుల నుంచి రూ. 515 కోట్ల రైస్​ బయటకు.. 

సూర్యాపేట జిల్లాలో సివిల్ సప్లయ్స్​ అధికారులు, టాస్క్ ఫోర్స్ తో కలిసి ఇటీవల చేపట్టిన తనిఖీల్లో 2022–-- 23 యాసంగి, వానాకాలం సీజన్​కు సంబంధించి 8 మిల్లుల నుంచి ఏకంగా రూ. 515 కోట్ల విలువైన 1.40 లక్షల టన్నుల సీఎంఆర్ రైస్​ను కాకినాడ పోర్ట్ ద్వారా ఎగుమతి చేసినట్లు తేల్చారు. ఇందులో 2022 --–23 రబీ సీజన్ సంబంధించి రూ.302.78 కోట్ల విలువ చేసే 83,911 టన్నులు, 2022– -- 23 వానాకాలం సీజన్ కు సంబంధించి రూ. 212.61 కోట్ల విలువ చేసే 56,184  టన్నులని గుర్తించారు.

అక్రమాలకు పాల్పడిన రైస్​మిల్లుల్లో ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన శ్రీ సంతోషి రైస్ మిల్​తో పాటు, హర్షిత రైస్ కార్పొరేషన్, ఎంకేఆర్ రైస్ మిల్, రఘు రామ్ ఇండ్రస్ట్రీస్, లక్ష్మి ట్రేడర్స్,  శ్రీ సంతోషి మా పారాబాయిల్డ్ మిల్​, శ్రీ వేంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీ, తిరుమల రైస్ కార్పొరేషన్ ఉన్నాయి. ఈక్రమంలో సివిల్​సప్లయ్స్​ ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు ఈ ఎనిమిది మిల్లుల యజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్పీడప్​ చేశారు. కాగా, వీరిలో కొందరు మిల్లర్లు తమపై పెట్టిన కేసులపై కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకోగా ఇంకా కొందరు పరారీలోనే ఉండడం గమనార్హం.