కరీంనగర్ జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నా సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  •     గడువు ముగుస్తున్నా రైస్​ఇవ్వట్లే
  •     మూడేళ్లుగా మారని రైస్ మిల్లర్ల తీరు
  •     ఒక ఏడాది సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌ను మరో ఏడాదిలో ఇస్తున్నరు
  •     బియ్యాన్ని దారి మళ్లించడంతోనే ఇవ్వలేకపోతున్నట్లు ఆరోపణలు 

కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. మిల్లులకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) తిరిగి అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బియ్యాన్ని దారిమళ్లిస్తూ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చేరుకోలేకపోతున్నారు. ఒక సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌టైంలో బియ్యం ఇవ్వకపోతే ఆతర్వాత సీజన్‌‌‌‌‌‌‌‌లో వడ్ల కేటాయించొద్దన్న రూల్​ను అధికారులు అమలుచేయడం లేదు. ఇదే అదనుగా మిల్లర్లు ఒక ఏడాది ఇవ్వాల్సిన బియ్యాన్ని మరో ఏడాదిలో అప్పటి వడ్లను మరాడించి ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చాలామంది రైస్ మిల్లర్లు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉండడంతో బియ్యం ఇవ్వకపోయినా మళ్లీ అదే మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా సీఎంఆర్ టార్గెట్ పెండింగ్ లోనే ఉంది. 

సర్కార్​ మెతక వైఖరి.. మిల్లర్లకు రూ.కోట్లు 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2022–-23 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 14.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి గానూ 6.20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తిరిగి ఇచ్చారు. 8.49 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఈ బియ్యం తిరిగి అప్పగించే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మూడుసార్లు డెడ్ లైన్ విధించింది. సెప్టెంబర్ 3‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న గడువు ముగిసినా ఈ నెల 31లోపు వరకు చాన్స్​ఇచ్చింది. ఇలా సడలింపులు ఇవ్వడమే వ్యాపారులకు కలిసి వస్తోంది. ఎలాగూ గడువు పొడగిస్తుందనే ఉద్దేశంతో కొందరు మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ముందుగా వారికి కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్ మార్కెట్ లో అమ్ముతూ రూ.కోట్లు గడిస్తున్నారు

వడ్లు ఉన్నాయా.. పక్కదారి పట్టాయా ? 

మిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వల విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఒక సీజన్ లో వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి సగం వరకు అమ్మేసి సొమ్ము చేసుకోవడం, అలా అమ్ముకున్న బియ్యాన్ని మరో సీజన్ లో వచ్చే వడ్లను మరాడించి అడ్జస్ట్ చేయడం పరిపాటిగా మారింది. ఆర్నెళ్ల కింద అప్పటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ నేతృత్వంలో హుజూరాబాద్ లోని మూడు మిల్లులతోసహా ఉమ్మడి జిల్లాలోని మరో 8 మిల్లులను టాస్క్ ఫోర్స్ టీమ్ లు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ధాన్యం నిల్వల్లో భారీగా తేడాలున్నట్లు అధికారులు ప్రకటించారు. తెరచాటు వ్యవహారం ఏం జరిగిందోగానీ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సీజ్ అయిన మిల్లులన్నీ తెరుచుకున్నాయి.

లక్షల మెట్రిక్​ టన్నులు పెండింగ్​

నిరుడు వానాకాలంలో ఉమ్మడి జిల్లాలో 350 రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద 11,53,264 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అలాట్ చేశారు. ఈ ధాన్యాన్ని పట్టించి 7,74,633 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కార్ కు అప్పగించాల్సి ఉంది. ఇప్పటి వరకు 4,56,849 మెట్రిక్ టన్నులే అప్పగించారు. ఇంకా 3,17,784 మెట్రిక్ టన్నుల బియ్యం తిరిగి ఇవ్వలేదు. యాసంగి సీఎంఆర్ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. యాసంగిలో 13,36,724 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు కేటాయించగా 7,05,483 టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1,73,979 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అప్పగించారు. ఇంకా  5,31,504 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది.