
- పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడే తొలి సభ
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత 2021లో ఆయన ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా నిర్వహించారు. అప్పుడు అమరవీరుల స్మృతివనం ఏర్పాటు, నాగోబా ఆలయ అభివృద్ధి, అమరవీరుల కుటుంబాల సంక్షేమం వంటివి అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాగోబా జాతర సందర్భంగా ఫిబ్రవరి 2న జిల్లాకు రానున్న రేవంత్.. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. నాగోబా ఆలయంలో జరుగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని, ఆయా శాఖల పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంద్రవెల్లి స్తూపం వద్ద హెలిప్యాడ్, వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లిలో జరిగింది. సభకు భారీగా జనం తరలిరావడం జిల్లా కాంగ్రెస్ లో జోష్ నింపింది. సీఎంగా కూడా తొలిసభ ఇంద్రవెల్లిలోనే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉట్నూరు, ఆదిలాబాద్ సభల్లో పాల్గొన్న రేవంత్.. అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను ప్రభుత్వం దత్తత తీసుకుంటుందని ప్రకటించారు. ఇంద్రవెల్లి బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని, స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.కోటితో స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఎకరం స్థలంలో ఏర్పాటు చేయనున్న ఈ స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే ముత్నూరు నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. కేస్లాపూర్ నాగోబా జాతరకు కూడా ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది.
రాజకీయాల్లో జోరుగా చర్చ
ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఏం రావడం కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం నింపనుంది. ఆదిలాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో కాంగ్రెస్ ఖానాపూర్ సెగ్మెంట్లోనే గెలిచింది. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. రేవంత్ పర్యటనతో మరింత ఊపు వస్తుందని, అది ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు.