హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‌సిటీ పరిధిలో సీఎన్ జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)తో నడిచే వాహనాల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా ఫిల్లింగ్స్టేషన్లు పెరగడం లేదు. దీనికితోడు సీఎన్జీ సరఫరా కూడా తక్కువగానే ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్దొరక్కపోవడం, దొరికే చోట గంటల తరబడి బారులు తీరాల్సి వస్తుండడంతో సీఎన్ జీ ఆటోలు నడిపే డ్రైవర్లు నష్టపోతున్నారు. కార్లు, ఇతర వాహనదారులకు కూడా సీఎన్జీ కొరతతో తిప్పలు తప్పడం లేదు.
కొరత ఎందుకంటే..
ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో45 వేల నుంచి 60 వేల వరకూ సీఎన్జీ ఆటోలు ఉండగా, మరో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు కార్లు, ఇతర ట్రాన్స్పోర్ట్వాహనాలు ఉన్నాయి. ప్రభుత్వం గ్రేటర్‌పరిధిలో కాలుష్యం పెరుగుతుందన్న కారణంతో 22 ఏండ్లుగా కొత్త ఆటోలకు అనుమతులివ్వడం లేదు. దీంతో చాలామంది వేరే జిల్లాల నుంచి సీఎన్జీ ఆటోలు నగరంలోకి తీసుకువచ్చి నడుపుకుంటున్నారు. సిటీలో రోజుకు 4 లక్షల కిలోల సీఎన్జీకి డిమాండ్ఉండగా, 3 లక్షల కిలోల లోపే సరఫరా అవుతోంది. అది ఎటూ సరిపోవడం లేదు.
గ్రేటర్‌వ్యాప్తంగా భాగ్యనగర్, మేఘా, టోరెంట్ కంపెనీలు సీఎన్జీని సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం కోర్‌సిటీలో 35 ఫిల్లింగ్స్టేషన్లు ఉండగా, మిగిలినచోట్ల మరో 45 నుంచి 50 వరకు స్టేషన్లు ఉన్నాయి. ఇందులోని కొన్ని బంకుల్లో సీఎన్జీ కోసం ఒకే పంపు ఉంది. రోజుకు 3 నుంచి 4 లారీల గ్యాస్అవసరముంటే.. ఒక్క లారీ మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో తిప్పలు తప్పడం లేదు. శివారు ప్రాంతాల్లో ఆన్లైన్స్టేషన్లు(అండర్గ్రౌండ్పైప్లైన్) ఉండడంతో పెద్దగా సమస్య లేదని, కోర్‌సిటీలోని ఫిల్లింగ్స్టేషన్లకు ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతుండడంతో అవి సరిపోవడం లేదని డీలర్లు అంటున్నారు. ఒక్కో ఆటోలో 4 కిలోలు మాత్రమే కెపాసిటీ ఉండడంతో ఒకేసారి ఎక్కువ నింపుకోవడానికి అవకాశం లేదు. అయిపోయిన వెంటనే ఫిల్లింగ్‌స్టేషన్‌కు వెళ్తే గ్యాస్దొరకడం లేదు.
అదనపు దోపిడీ..
పలు ఫిల్లింగ్స్టేషన్లలో సీఎన్జీకి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కిలో సీఎన్ జీ రూ. 96 కాగా, కొందరు రూ.105 నుంచి రూ.110 తీసుకుంటున్నారని ఫిరోజ్అనే ఆటో డ్రైవర్ఆరోపించాడు. పెరుగుతున్న ఆటోల సంఖ్యకు తగ్గట్టుగా ఫిల్లింగ్స్టేషన్లు పెంచాలని శ్రీహరి అనే మరో ఆటో డ్రైవర్కోరాడు. గంటల తరబడి ఫిల్లింగ్‌స్టేషన్ల ముందు వెయిట్చేయడంతో తమ వ్యాపారంపై ప్రభావం పడుతోందని వాపోయాడు.
అధిక మైలేజీ వస్తుండడంతోనే డిమాండ్
పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్‌జీ గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు రూ.15 నుంచి రూ.20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే, కిలో సీఎన్‌జీ రూ.22 నుంచి రూ.28 కిలోమీటర్ల వరకు వస్తుంది. దీంతోనే చాలా మంది సీఎన్జీ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం కాలుష్య నివారణకు ఎలక్ట్రీక్, సీఎన్జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు చెబుతోంది. కానీ సీఎన్జీ వాహనాలు కొంటే గ్యాస్నింపుకునేందుకే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. ప్రభుత్వం మరిన్ని ఫిల్లింగ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని, డిమాండ్‌కు సరిపడా గ్యాస్సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఆటోలపై తీవ్ర ప్రభావం
సీఎన్జీ దొరక్క ఆటో డ్రైవర్ల సమయం వృథా అవుతోంది. అలాగే రేట్లు కూడా తగ్గించాలె. ఒకప్పుడు రూ. 40 – 50 గ్యాస్ కొట్టిస్తే 30 కిలోమీటర్లు నడిపేవారు. ఇప్పుడు రూ. 96 పెట్టి నింపుకోవాల్సి వస్తున్నది. గ్యాస్ ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఆటోచార్జీలు పెంచడం లేదు. గ్యాస్ ధరలు పెరగడంతో వచ్చిన దాంట్లో గ్యాస్ కే సగం ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఎ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటోడ్రైవర్స్ సమాఖ్య అధ్యక్షుడు