- అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని సహకార సంఘం బ్యాంక్ లో భారీ కుంభకోణం జరిగిందని, పాలకవర్గంతో పాటు సిబ్బందిని కూడా తొలగించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కీతవారిగూడెంలో ఖమ్మం–జడ్చర్ల- హై వేపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సహకార సొసైటీలో రైతుల డబ్బులు సుమారు రూ.20 లక్షలు నొక్కేశారని ఆరోపించారు. పీఏసీఎస్ లో చోరీ జరిగి 15 రోజులు అయినా ఇప్ప వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు.
వెంటనే పాలకవర్గాన్ని రద్దు చేయాలని, రూ.8 లక్షల దొంగతనంలో నిందితులను అరెస్టు చేసి డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల డబ్బులను రక్షించలేని చైర్మన్, సీఈవో రాజీనామా చేయాలన్నారు. సొసైటీ బ్యాంకులో సీసీ కెమెరాలు పెట్టాలని కోరారు. ఎస్సై వెంకట్ రెడ్డి జోక్యం చేసుకొని అవినీతికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకొని, సహకార సంఘానికి న్యాయం జరిగే విధంగా చూస్తామని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ మియా, సీపీఎం నాయకుడు తుమ్మల సైదయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు కామల్ల నవీన్, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ మండల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సందీప్, సోమయ్య, వెంకటేశ్వర్లు, శ్రీను రైతులు తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ సీఈవో, క్యాషియర్ సస్పెండ్
ఇటీవల క్యాష్ కౌంటర్ లో దొంగతనానికి బాధ్యులైన రాయినిగూడెం ప్రాథమిక సహకార క్యాషియర్ బాదె గోపాలకృష్ణ, సెక్రటరీ కాట్రేవుల లక్ష్మయ్య ను సస్పెండ్ చేసినట్లు పీఏసీఎస్ చైర్మన్ ముప్పారపు రామయ్య తెలిపారు. రాయిని గూడెం సీఏసీఎస్ పాలకవర్గ సమావేశాన్ని బుధవారం నిర్వహించి క్యాషియర్ వద్ద నుంచి దొంగతనానికి గురైన అమౌంట్ ను కట్టించినట్లు తెలిపారు.
కౌంటర్లో ఉన్న క్యాష్ ను లాకర్ లో పెట్టుకోవాల్సిన బాధ్యత లేకుండా ఉన్న క్యాషియర్ ను, జాయింట్ కస్టడీలో ఉండాల్సిన నగదును కేవలం క్యాషియర్ కు వదిలేసి నిర్లక్ష్యం వహించిన సెక్రటరీ లక్ష్మయ్య ను సస్పెండ్ చేశామని చెప్పారు. సంఘ కార్యకలాపాలు యథావిధిగా నిర్వహణ కోసం తాత్కాలిక సంఘ కార్యదర్శిగా నిడిగొండ కనకయ్య ను, క్యాషియర్ గా పాలెల్లి అంజయ్య ను నియమించినట్లు తెలిపారు.