కామారెడ్డి, వెలుగు: జిల్లాలో క్రాఫ్ లోన్ల వసూలు కోసం స్పెషల్‌డ్రైవ్ పేరుతో కో ఆపరేటివ్బ్యాంక్ఆఫీసర్లు రైతుల ఇండ్ల ముందు హంగామా చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో లోన్లు చెల్లించని రైతుల ఇంటికి వెళ్లి ఆస్తులు జప్తు చేస్తామంటూ బెదిరిస్తున్నారు. లోన్కట్టని రైతుల ఇండ్ల తలుపులు తొలగించి, ఇంట్లోని సామాన్లు ఎత్తుకెళ్తూ వేధింపులకు దిగుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార బ్యాంక్ ఆఫీసర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఫైనాన్షియల్ఇయర్ఈ నెలాఖరున ముగియనుండడంతో లోన్ల వసూళ్ల టార్గెట్ పూర్తి చేసేందుకు కో ఆపరేటివ్బ్యాంక్ ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ‘వన్‌టైం సెటిల్మెంట్ఆఫర్.. లోన్లు చెల్లిస్తారా..? ఆస్తులు జప్తు చేయమంటారా..?’ అంటూ రైతులను బెదిరిస్తున్నారు. పంటను అమ్మలేదని, అమ్మిన తర్వాత బకాయిల్లో కొంతైనా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా..ఆఫీసర్లు కనికరించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సహకార బ్యాంకుల్లో అగ్రికల్చర్‌కు సంబంధించి లాంగ్‌టర్మ్ లోన్లు సుమారు రూ. 130 కోట్ల బకాయిలు ఉన్నాయి. అగ్రికల్చర్ డెవలప్మెంట్లో భాగంగా బోరు మోటార్, పైపులైన్ ఏర్పాటు, ట్రాక్టర్ కొనుగోలుకు, కోళ్ల ఫారాలు, డెయిరీ ఫామ్స్ ఏర్పాటుకు రైతులకు సహకార బ్యాంక్ ఈ లాంగ్‌టర్మ్ లోన్లు ఇస్తుంది. రైతుకు ఉన్న అగ్రికల్చర్భూమిని బ్యాంక్‌కు మార్టిగేజ్ చేసిన తర్వాత లోన్ ఇస్తారు. రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు లోన్ ఇస్తారు. లోన్ సొమ్మును ఏడాదికి రెండు ఇన్స్టాల్మెంట్లుగా చెల్లించాలి. పంటల దిగుబడి సరిగ్గా రాక, ఆర్థిక ఇబ్బందులు, దీనికి తోడూ బ్యాంక్ ఆఫీసర్లు కూడా మొదట్లో లోన్ల వసూళ్లపై నిర్లక్ష్యం చేయడం వల్ల బకాయిలు పేరుకుపోయాయి. మిత్తికి మిత్తి వేస్తుండడంతో బకాయిలు రెండింతలయ్యాయి. దీంతో భారీగా పెరిగి రైతులు చెల్లించలేని పరిస్థితి వస్తోంది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలోని పలు మండలాల్లో సహకార బ్యాంక్ ఆఫీసర్లు లోన్ల రికవరీ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నస్రుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రైతుల ఆస్తులు జప్తు చేస్తామంటూ హంగామా చేశారు. అంకోల్‌లో కొందరు రైతుల ఇండ్ల తలుపులు లేపడం, ఇతర సామాన్లు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా గ్రామస్తులంతా కలిసి అడ్డుకున్నారు. పంట చేతికొచ్చినంక అమ్మి లోన్కడతామని చెప్పినా వినిపించుకోలేదు. ఒకరిద్దరు రైతుల తలుపులు లేపడం, ఒక రైతు ఇంట్లో అతడి కొడుకు ల్యాప్ ట్యాప్ తీసుకెళ్తామని బెదిరించడం, ఇంకో రైతుకు చెందిన బైక్ జప్తు చేసేందుకు యత్నించారని రైతులు వాపోతున్నారు. రాజకీయ అండదండలున్న వారిని వదిలి పేద, మధ్య రైతులనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బాన్స్వాడ నియోజక వర్గంలోపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పలువురు రైతులు ఈ విషయంపై కంప్లైంట్‌కూడా చేశారు.
బైక్ సీజ్ చేస్తామంటే.. అప్పు చేసి కట్టిన..
‘మా నాయిన పసుపుల సాయిలు. 2015లో కో ఆపరేటివ్ బ్యాంకులో లోన్తీసుకున్నడు. ఆ తర్వాత కొన్ని రోజులకు చనిపోయిండు. లోన్ తెచ్చిన సంగతి మాకు తెల్వది. ఇటీవల మా ఇంటికి కో ఆపరేటివ్బ్యాంక్ ఆఫీసర్లు, సిబ్బంది వచ్చిన్రు. ‘మీ నాయిన పేరు మీద లోన్బాకీ ఉంది. ఇప్పుడు చెల్లిస్తే చెల్లించండి.. లేకపోతే ఇంట్లోని వస్తువులు జప్తు చే స్తం’ అని కూసున్రు. నేను ఇంటికి వచ్చే సరికి సామాన్లు వెతుకుతున్రు. నా బైక్‌ను తీసుకెళ్తామని చెప్పడంతో అప్పటికప్పుడు తెలిసినోళ్ల దగ్గర రూ.38 వేలు తెచ్చి కట్టిన.
- శ్రీనివాస్, అంకోల్ గ్రామం
వన్‌టైమ్ సెటిల్మెంట్వినియోగించుకోవాలని చెబుతున్నాం
లాంగ్‌టర్మ్ లోన్ల బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. రికవరీ కోసం వెళ్లినప్పుడు ఇప్పటి వరకు ఎక్కడా కఠినంగా వ్యవహరించలే. లోను పైసలు వన్ టైం సెటిల్ మెంట్ కింద పెట్టిన ఆఫర్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నాం. నస్రుల్లాబాద్ మండలంలో తలుపులు లేపామని చెప్తున్నారు. అది వాస్తవం కాదు.
- గజానంద్, సీఈవో, డీసీసీబీ బ్యాంక్