కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు.. ల్యాప్ టాప్ లు,బండ్లు, తలుపులు ఎత్తుకుపోతున్నరు

  • పల్లెల్లో కో ఆపరేటివ్ బ్యాంకుల నిర్వాకం 

కామారెడ్డి/పెద్దపల్లి, వెలుగు: అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులంతా దిక్కుతోచని స్థితిలో ఉంటే.. టైం గాని టైంలో పాత లోన్లు, వాటి మిత్తీలు కట్టాలంటూ కో ఆపరేటివ్​ బ్యాంక్​ సిబ్బంది ఊళ్ల మీద పడ్తున్నారు. మార్చి 31కి ఫైనాన్సియల్​ఇయర్ ముగుస్తున్నందున టార్గెట్ రీచ్​ అయ్యేందుకు స్పెషల్ డ్రైవ్​ల పేరిట నానా యాగి చేస్తున్నారు. అప్పులు కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తామని వార్నింగులు ఇస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనైతే ఇండ్లలో దొరికిన సామాన్లను ఎత్తుకెళ్తున్నారు. పంటలు చేతికి వచ్చాక కడ్తామని చెప్తున్నా వినిపించుకోవడం లేదని,  పిల్లల ఫోన్లు, ల్యాప్​ట్యాప్​లు కూడా ఎత్తుకెళ్తున్నారని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో దండోరా వేయిస్తూ రైతులను భయపెడుతున్నారు. 

దొరికినయ్​ దొరికినట్టు..  

జిల్లాలో అగ్రికల్చర్ ​డెవలప్​మెంట్​లో భాగంగా బోర్ల తవ్వకం, మోటార్ల బిగింపు, పైపులైన్ల ఏర్పాటు, కోళ్ల ఫారాలు, డెయిరీల ఏర్పాటుకు రైతులు కో అపరేటివ్ ​బ్యాంక్​ ద్వారా దీర్ఘకాలిక( లాంగ్​టర్మ్​) లోన్లు తీసుకున్నారు. ఒక్కో రైతు రూ. 2 నుంచి రూ. 4 లక్షల వరకు లోన్లు తీసుకున్నారు. అయితే, పంటలు సరిగ్గా పండక, ఇతర ఇబ్బందులతో రైతులు ఆ లోన్లను సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో బకాయిలు పెరిగిపోయాయి. ఇలా ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో లాంగ్​టర్మ్​ బకాయిలు రూ.130 కోట్ల వరకు పేరుకుపోయాయి.

వీటిని  వసూలు చేసేందుకు కో అపరేటివ్​ బ్యాంక్​ ఆఫీసర్లు స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు. దీని కోసం స్పెషల్ ​టీమ్స్​ను ఏర్పాటు చేశారు. వీరు రైతులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. నస్రుల్లాబాద్​ మండలం 
అంకోల్​లో  నలుగురు రైతుల ఇండ్లకు వెళ్లిన ఆఫీసర్లు వెంటనే బకాయిలు కట్టకపోతే ఇంట్లో వస్తువులు తీసుకెళ్తామని హంగామా చేశారు.  

ఓ రైతు ఇంటి తలుపులు తీసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. మరో రైతు ఇంట్లో బైక్, ఇంకో  రైతు ఇంట్లో పిల్లల ల్యాప్​ట్యాప్​ తీసుకెళ్తామంటూ తెచ్చి బయట పెట్టారు. రైతులు,  గ్రామస్తులు ఆఫీసర్లను అడ్డుకుని మరికొంత సమయం ఇస్తే చెల్లిస్తారని నచ్చజెప్పారు. తన బైక్​ను తీసుకెళ్తుండడంతో ఊర్లో పరువు పోతుందని అప్పటికప్పుడు రూ38 వేలు అప్పు తెచ్చి కట్టినట్టు ఓ రైతు చెప్పాడు.   

కట్టకపోతే చర్యలు తప్పవట

పెద్దపల్లి జిల్లాలో లోన్లు కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తామని సహకార సంఘం గ్రామాల్లో దండోరా వేయిస్తోంది. ఎలిగేడు మండలంలో రెండు రోజులుగా బ్యాంకు అధికారులు తాకట్టు రుణాలు చెల్లించాలని, లేకపోతే చర్యలు తప్పవని మైకులో అనౌన్స్​ చేయిస్తున్నారు. ఇప్పటికే క్రాప్​ లోన్లు కట్టలేదని బ్యాంకు అధికారులు ఖాతాలను ఫ్రీజ్ ​చేస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొత్తగా సహకార బ్యాంకు తమ  లోన్లు చెల్లించాలని హెచ్చరిస్తుండడంతో భయపడుతున్నారు.

2018 కి ముందు తీసుకున్న రుణాల్లో రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని కేసీఆర్​ సర్కార్​ ప్రకటించినా, ఇప్పటి వరకు చేయలేదు. రెండేండ్లుగా క్రాప్​ లోన్లు కట్టని వారి ఖాతాలను బ్యాంకర్లు ఫ్రీజ్ ​చేస్తున్నారు. దీంతో  రైతులు రైతుబంధును కూడా తీసుకోలేకపోతున్నారు. ఏ దారి లేక భూమి పత్రాలను తాకట్టు పెట్టి చాలా మంది సహకార బ్యాంకుల నుంచి లోన్లు పొందారు. మధ్యలో వచ్చిన వానలతో పంటలు నష్టపోయి కట్టలేకపోయారు. అయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని, లేకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

నెక్కొండ డీసీసీబీ బ్యాంకులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  •     డబ్బులు కట్టాలంటూ వేధింపులు
  •   పురుగుల మందు తాగబోయిన వ్యక్తి 

నెక్కొండ : లోన్​కట్టాలంటూ డీసీసీబీ బ్యాంకు ఆఫీసర్లు వేధిస్తున్నారని వరంగల్ ​జిల్లా నెక్కొండలో సోమవారం రాత్రి ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు.బాధితుడి కథనం ప్రకారం.. సూరిపల్లికి చెందిన బాబురాజు తన భార్య రజిత పేరుపై ఏడాది క్రితం కిరాణ దుకాణం పెట్టుకుంటానని రూ.లక్ష లోన్ ​తీసుకున్నాడు. అందులో రూ.80వేలు చెల్లించానని చెప్పాడు. మరో రూ.20వేలు బాకీ ఉండగా, మూడు రోజుల క్రితం బ్యాంకు ఆఫీసర్లు రాజు ఇంటికి వెళ్లి లోన్ ​వెంటనే కట్టాలంటూ తలుపులు తీశారు. దీంతో రాజు కాళ్లా వేళ్లాపడి వేడుకోవడంతో వెళ్లిపోయారు.  మనస్తాపానికి గురైన రాజు తన 7 గుంటల భూమిని అమ్మి ఆ డబ్బులతో సోమవారం బ్యాంకుకు వెళ్లాడు.

బ్యాంకు ఆఫీసర్లు మాత్రం రూ.వడ్డీతో కలిపి మరో రూ.80 వేలు చెల్లిస్తేనే క్లియర్ ​అవుతుందని చెప్పారు. కావాలంటే రూ.10వేలు తక్కువ చేస్తామని చెప్పారు. దీంతో బ్యాంకులోనే పురుగుల మందు తాగబోయాడు. అక్కడున్న రైతులు అడ్డుకుని బయటకు తీసుకువచ్చారు. తనకు న్యాయం జరిగే వరకు బ్యాంకు ఎదుటే ఆందోళన చేస్తానని బైఠాయించాడు. బ్యాంకు సీఈఓ వీరస్వామి  వచ్చి సర్ధి చెప్పి పంపించారు. మేనేజర్​ తిరుపతిని వివరణ కోరగా..రాజు  కిస్తీలు కట్టకపోవడంతో లీగల్ ​నోటీసులు ఇచ్చామని, సోమవారం వన్​టైం సెటిల్​మెంట్​ చేస్తానని వచ్చాడన్నారు.  తమ పరిధిలో లేదని చెప్పడంతో మందు తాగి వచ్చి బ్యాంకు ముందు ఆందోళన చేశాడని చెప్పారు.