హైదరాబాద్: పారిస్ పారాలింపిక్స్ పతక విజేత దీప్తి జివాంజిపై ఆమె కోచ్ నాగపురి రమేష్ ప్రశంసలు కురిపించారు. పారిస్ పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న దీప్తి.. ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో దీప్తికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోచ్ రమేష్ మాట్లాడుతూ.. దీప్తిని ఫస్ట్ టైం ఖమ్మం డ్రిస్ట్రిక్ మీట్లో చూశానని.. షూ లేకుండానే చిరుతలా పరుగెత్తిందని కొనియాడారు. అప్పుడే దీప్తికి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌కు తీసుకురావాలని అనుకున్నానని.. కానీ ఆమె తల్లిదండ్రులని ఒప్పించేందుకు చాలా టైమ్ పట్టిందని చెప్పారు.
వాళ్లను ఒప్పించిన తర్వాత స్పోర్ట్స్ ఆథారిటీ అఫ్ ఇండియా హాస్టల్లో జాయిన్ చేశానని వెల్లడించారు. పుల్లెల గోపీచంద్ ఆర్థిక సహాయం చేయడంతో వివిధ దేశాల్లో పోటీలకు పంపించానని తెలిపారు. జపాన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిందని.. ఇప్పుడు తన హెల్త్ బాలేకున్నా పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిందని ప్రశంసించారు. విశ్వక్రీడల్లో సత్తా చాటి తెలంగాణ పేరు మోరుమోగిపోయేలా చేసిన దీప్తికి రాష్ట్ర ప్రభుత్వ నుండి సహాయం లభిస్తుంది అనుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.